CM YS Jagan: తీవ్ర ఎండను కూడా ఖాతరు చేయకుండా ప్రజలంతా సభకు వచ్చారని.. మరో రెండు వారాల్లో జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని.. వచ్చే ఐదేళ్లలో ఇంటింటి అభివృద్ధిని.. ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దీనిని ప్రజలు గుర్తించాలన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిస్తామని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ఆగిపోతాయని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చంద్రబాబు చెబుతున్నవి మోసాలు అని.. బాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనన్నారు. అందరూ దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలన్నారు. అమలు చేసిన కొన్ని పథకాల పేర్లు చెబుతా.. చంద్రబాబు చెప్పగలరా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశానని చెబుతాడని.. 58 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందన్నారు.
Read Also: RSS: ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు.. స్పష్టం చేసిన మోహన్ భగవత్..
“ఇంటికే రూ.3000 పెన్షన్ కానుక ఇస్తున్నామని.. ప్రజలకు గుర్తుకు వచ్చేది జగనే.. విద్యార్థులకు వసతి దీవెన.. విద్యా దీవెన అంటే గుర్తుకు వచ్చేది జగనే.. అమ్మ ఒడి పథకం అంటే గుర్తుకు వచ్చేది జగన్.. అక్క చెల్లెమ్మలకు చేయూత.. కాపు నేస్తం ..ఈ బీసీ నేస్తం. ఆసరా.. సున్నా వడ్డీ.. అక్క చెల్లెమ్మల పేర 30 లక్షల ఇళ్ల పట్టాలు… నిర్మిస్తున్న 20 లక్షల ఇళ్ల నిర్మాణం.. మహిళా సాధికారత అంటే గుర్తుకు వచ్చేది మీ జగనే” అని సీఎం పేర్కొన్నారు. రైతులకు అండగా ఉంటూ పెట్టుబడులకు తోడుగా ఉంటూ రైతు భరోసాను అందిస్తున్నామన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని.. వీటిని చూస్తే గుర్తుకు వచ్చేది మీ జగనే అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆరోగ్య శ్రీ ఆరోగ్య సురక్ష .. ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా పేదవారికి అండగా ఉంటున్నామన్నారు. స్వయం ఉపాధికి ఊతమిస్తూ లా నేస్తం..చేదోడు… మత్సకార భరోసా.. ఆటో నేస్తమంటే గుర్తుకు వచ్చేది జగనే అని అన్నారు. గ్రామంలోనూ సచివాలయం… 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ.. నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు.. ప్రభుత్వ ఆసుపత్రులు.. గ్రామంలోనే మహిళా పోలీస్.. అక్క..చెల్లెమ్మల ఫోన్లో దిశా యాప్.. ఇవన్నీ చూస్తే గుర్తుకు వచ్చేది జగనేనన్నారు.
Read Also: CPM Srinivas Rao : 175 శాసనసభ స్థానాలలో పోటీలో 124 మంది సంపన్నులు
చంద్రబాబును చూస్తే ఏ పథకమైనా గుర్తుకు వస్తుందా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్ళు సీఎంగా చేశారు కానీ పేదవారికి ఒక మంచి కూడా చేయలేదన్నారు. 2014-2019 మధ్య జన్మభూమి కమిటీలను చంద్రబాబు పెట్టారు.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు.. నాది సచివాలయ వ్యవస్థ.. జన్మభూమి కమిటీల మీద చంద్రబాబుకు విశ్వాసం ఉంటే.. మళ్లీ అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు తెస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. జగన్ పెట్టిన వాలంటీర్.. సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు చెబుతున్నారన్నారు. వాలంటీర్లకు జీతం పెంచుతానని చెబుతున్నారే తప్ప దాని రద్దు చేస్తానని చెప్పడం లేదన్నారు. కానీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చెప్పడం లేదన్నారు. “జగన్ రూపాయి ఇస్తే నాలుగు రూపాయలు ఇస్తానంటావు?.. 14 ఏళ్లు సీఎం అంటావు, నీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా?.. జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకొస్తానని చెప్పే ధైర్యం ఉందా?.. జగన్ అమ్మ ఒడి పెడితే, అంతకంటే ఎక్కువ నేను ఇస్తానంటావు?.. సచివాలయ, వాలంటీర్, రైతు భరోసా వ్యవస్థల ను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?.” అని జగన్ ప్రశ్నించారు. మా పథకాలే చెబుతున్నారే తప్ప… ఆయన మార్కు పథకాలు లేవన్నారు. జగన్ తెచ్చిన పథకాలు బాగా లేకపోతే వాటిని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని.. చంద్రబాబును నమ్మడం అంటే .వదలా. బొమ్మాళీ వదలా.. పశుపతిని ఇంటికి తీసుకురావడమేనని తీవ్రంగా విమర్శించారు. 2014లో జనసేన బీజేపీ టీడీపీలు కలిసి మేనిఫెస్టోను తీసుకువచ్చాయన్నారు.
“రైతు రుణమాఫీ పై మొదటి సంతకం పెడతానని హామీ ఇచ్చారు …అది అమలైందా?.. ఎందుకు సంఘాల రుణాలను రద్దు చేస్తామని చెప్పారు.. చేశారా?.. ఇంటింటికి ఉద్యోగం అన్నారు..ఇచ్చారా?.. ప్రతి పేదవాడికి మూడు సెంట స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు.. ఒకరికైనా ఇచ్చారా?.. మహాలక్ష్మి పథకం అమలైందా?.. ఎన్నో హామీలు ఇచ్చారు.. ఏమీ జరగలేదు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు..ఎక్కడా కనపడటం లేదు. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా. మళ్లీ ఇప్పుడు ఇదే ముగ్గురు కలిసి వస్తున్నారు. సూపర్ సిక్స్ అని అంటున్నారు… నమ్ముతారా?.. ఎవరి వల్ల మంచి జరిగిందనే విషయాన్ని ఆలోచించండి. ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. వాలంటీర్ ఇంటికి రావాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా..ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు …25 ఎంపీ స్థానాలకు 25 స్థానాలూ గెలవాలి.” అని సీఎం జగన్ ప్రజలను కోరారు.