Site icon NTV Telugu

CM Revath Reddy: త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా.. ఇలా కలుస్తాననుకోలేదు!

Suravaram Sudhakar Reddy Cm

Suravaram Sudhakar Reddy Cm

CM Revanth Reddy Pays Tribute to Suravaram Sudhakar Reddy: పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్‌ రెడ్డి అని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. రాజీపడని జీవితం, రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. బహుజనుల సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా మలుచుకున్న వారికి ఇది తీరని లోటు అన్నారు. తమ జిల్లాకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడు అని చెప్పారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణకు తీరని లోటన్నారు. త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా అని, ఇలా కలుస్తాననుకోలేదు అని సీఎం చెప్పారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి పార్థివ దేహానికి మఖ్దూం భవన్‌లో సీఎం రేవంత్‌ నివాళులర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ‘బహుజనుల సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా మలుచుకున్న వాళ్ళకి తీరని లోటు. రాజీపడని జీవితం.. రాజీపడని సిద్ధాంతం ఆయనది. AISF నుంచి జాతీయ కార్యదర్శిగా.. ఏ హోదాలో పని చేసిన అహంకారం లేకుండా పని చేశారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నాకు లేఖ రాశారు. అసెంబ్లీలోనే లేఖను చదివి యూనివర్సిటీ పేరు మార్చాను. మా జిల్లాకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడు. ప్రజా సేవనే కాదు.. సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణకు తీరని లోటు. నిన్న జరిగిన PACలో కూడా వారిని స్మరించుకుని.. వారి సేవలను చర్చించుకున్నాం. త్వరలోనే నేను మీ ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పిన, కానీ ఇలా కలుస్తాను అనుకోలేదు. వారి జ్ఞాపకార్థం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాం, దీనిపై మంత్రివర్గంలో చర్చిస్తాం. తెలంగాణ మహనీయులను గుర్తించి వారి పేరు చిరస్థాయిగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని అన్నారు.

Also Read: Medipally Murder: మీ తోటి కాకుంటే చెప్పుర్రి సార్.. ఆ నా కొడుకుని నేనే చంపేస్తా!

సీపీఐ దిగ్గజ నేత సురవరం సుధాకర్‌ రెడ్డి (83) గచ్చిబౌలిలోని కేర్‌ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో 1942 మార్చి 25న జన్మించిన సుధాకర్‌ రెడ్డికి సతీమణి విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు (నిఖిల్‌, కపిల్‌) ఉన్నారు. 1998, 2004 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా నుంచి ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. హిమాయత్‌ నగర్‌లోని సీపీఐ కార్యాలయం నుంచి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీగా వెళ్లి సురవరం భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నారు.

Exit mobile version