NTV Telugu Site icon

CM Revanth Reddy : రైతులకు గుడ్‌న్యూస్‌.. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌

Cm Revanth Reddy

Cm Revanth Reddy

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్సీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సివిల్​ సప్లయిస్​ ఎండీ డీఎస్​ చౌహన్​, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్​ రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పినట్లు సీఎం ప్రకటించారు. ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా.. ఎక్కడైనా కొనుగోలు కేంద్రం అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం చెప్పారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కావటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి తప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందని అన్నారు.

సన్నవడ్ల సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలు, లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సన్న వడ్లు కొనేటప్పుడు నిర్దేశించిన ప్రమాణాలు తప్పకుండా పాటించాలని అధికారులను అప్రమత్తం చేశారు. సన్న రకాలను ధ్రువీకరించే యంత్రాలు, సిబ్బందిని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. సన్న వడ్ల సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్​మాల్​ జరిగే ప్రమాదముందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అటువంటి తప్పులు, అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు.

Read Also : Tirumala Brahmotsavam: తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. ప్రైవేట్ వాహనాలపై పోలీసుల ఆంక్షలు

ప్రతి కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించాలని, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నెంబర్ తప్పకుండా వేయాలని సూచించారు. దీంతో ఏ తప్పు జరిగినా, ఏ దశలో గోల్​ మాల్​ జరిగినా ఎక్కడ జరిగిందో సులభంగా తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని మార్గాల్లోనూ పకడ్బందీగా నిఘా ఉంచాలని, చెక్ పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. తాలు ,తరుగు, తేమ పేరు తో రైతులను మోసం చేసే వారిని సహించవద్దని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం చెప్పారు. రైతులు ఎక్కడ కూడా దోపిడీకి గురి కాకూడదని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలని కోరారు.

అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడే సంఖ్యలో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంట వెంటనే తరలించేందుకు తగిన రవాణా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు వాతావరణ శాఖ సూచనలను చేరవేయాలని, దానికి అనుగుణంగా కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి రోజు కలెక్టర్లు తమ జిల్లాలో జరుగుతున్న కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించాలని, ప్రతి రోజు ఉదయం నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. పాత పది జిల్లాలకు నియమించిన ప్రత్యేకాధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలుంటే ఏ రోజుకారోజు పరిష్కరించాలని, సివిల్ సప్లయిస్ విభాగంలో 24X7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగు చేసిన విస్తీర్ణంలో 58 శాతం సన్న రకాలు సాగయ్యాయి. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుంచి సన్నాల దిగుబడి మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమంగా రాష్ట్రంలో వంద శాతం సన్న వడ్లు పండించే రోజులు వస్తాయన్నారు. దొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదని, ఎఫ్సీఐ వద్ద కూడా భారీగా నిల్వలున్నాయని, అందుకే సన్న రకపు వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. వచ్చే జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు.

ఈసారి దిగుబడి అయ్యే 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ట్రేడర్లు, మిల్లర్లు, కొనుగోలు చేసే ధాన్యం, రైతులు తమ అవసరాలకు ఉంచుకునే నిల్వలు పక్కనపెడితే.. 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. అందులో 44 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉంటాయని చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చే విషయంలోనూ కలెక్టర్లు నిబంధనలను పాటించాలని చెప్పారు. గతంలో వరుసగా బకాయి పడ్డ డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దని చెప్పారు. మిగతా మిల్లర్లకు కూడా బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం ఇవ్వాలని సూచించారు.

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన

అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మొత్తం 11062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగలోపు నియామక పత్రాలను అందిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 9090 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారు.

Show comments