CM Revanth Reddy: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన యోధులకు ఘనంగా నివాళులర్పించారు. అన్యాయాన్ని ఎదిరించడం తెలంగాణ గడ్డ స్వభావమని, పోరాట యోధులకు తెలంగాణ పుట్టినిల్లుగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైన రోజని అన్నారు.
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలో కొనసాగిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణతో పాటు ప్రస్తుత మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేవని తెలిపారు. రజాకార్ల దౌర్జన్యాలు, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని అన్నారు.
హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలు, అప్పటి ఉద్యమాల నేపథ్యంలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఆపరేషన్ పోలో చేపట్టారని సీఎం పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో అంతర్భాగమైందని, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భంగా ఈ రోజును భావిస్తున్నామని అన్నారు.
తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంతో పోటీ పడుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే దాదాపు 91% అధికమని పేర్కొన్నారు. అభివృద్ధి కేవలం గణాంకాల్లో కాకుండా ప్రజల ముఖాల్లో, జీవితాల్లో కనిపించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. రైతులకు అండగా నిలిచే లక్ష్యంతో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని సీఎం తెలిపారు. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించామని చెప్పారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని, సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించామని వెల్లడించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం 32 నెలల్లో దాదాపు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. భూ పరిపాలనలో సంస్కరణల కోసం భూ భారతి చట్టం తీసుకొచ్చామని, భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలను ప్రారంభించామని చెప్పారు.
అలాగే రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, దీని ద్వారా మహిళలకు రూ.12,385 కోట్ల మేర ప్రయాణ ఖర్చు ఆదా అయిందని చెప్పారు. గృహజ్యోతి కింద 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు.
ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. తొలి దశలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించామని తెలిపారు. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, 15 లక్షలకు పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. 43 లక్షలకు పైగా మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందుతున్నాయని తెలిపారు.
సామాజిక న్యాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలతో కుల సర్వే నిర్వహించామని తెలిపారు. ఆ గణాంకాల ఆధారంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను చేపట్టామని, సామాజిక న్యాయం తమకు కేవలం నినాదం కాదని సీఎం స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించామని, ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించేందుకు రూ.927 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మధ్యాహ్న భోజనాన్ని 12వ తరగతి వరకు విస్తరించామని తెలిపారు. 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నామని చెప్పారు.
ఆరోగ్య రంగంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5.19 లక్షల మందికి రూ.2,526 కోట్ల సహాయం అందించామని సీఎం వెల్లడించారు. గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని రేవంత్ రెడ్డి అన్నారు. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. ఏఐ కారణంగా ఉద్యోగాల స్వరూపం మారుతున్న నేపథ్యంలో కొత్త నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేశామని, పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తున్నామని సీఎం తెలిపారు. రూ.38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాలకు అనుమతులు సాధించి, భూసేకరణ చేపట్టామని తెలిపారు. హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రారంభించామని, 55 కిలోమీటర్ల పరిధిలో మూసీని పునరుజ్జీవింపజేస్తామని చెప్పారు. ఆహార కల్తీని అరికట్టేందుకు టీజీ సేఫ్‌ను ఏర్పాటు చేశామని, రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు ఈగల్ వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్‌జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, ఈవీ పార్క్, లైఫ్ సైన్సెస్ హబ్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వంటి ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల సహకారం, అవగాహన కల్పించేందుకు మీడియా సహకారం అవసరమని కోరారు. సెప్టెంబర్ 17 కేవలం గతాన్ని గుర్తు చేసుకునే రోజు మాత్రమే కాదని, భవిష్యత్ బాధ్యతలను గుర్తు చేసే రోజు కూడా అని రేవంత్ రెడ్డి అన్నారు. చరిత్రను మరిచిపోమని, అయితే చరిత్ర దగ్గరే ఆగిపోకుండా పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రపంచం గర్వించేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

