NTV Telugu Site icon

Revavnth Reddy : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి

Cm Revanth Reddy

Cm Revanth Reddy

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశమిచ్చారు. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశామని, కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన అన్నారు. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని, ఈ నూతన సంవత్సరం ‘రైతు – మహిళ – యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచామని, తర్వలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతి పై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చామని, ఆ దిశగా చర్యలు మొదలు పెట్టామన్నారు.

అంతేకాకుండా.. ‘అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు. ఇది గత పాలన కాదు… జన పాలన. ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నాం. ఆ కేసుల నుండి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సంక్షేమం పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తెలంగాణ కోటి రతనాల వీణగా… కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా… అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తున్నా.. ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని..’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.