ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్‌కు మెట్రోను పొడిగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో నిర్మించిన వంతెనను శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ లో చేదు అనుభవం ఎదురైనా…మీరు నన్ను ఆదరించారన్నారు. ఎల్బీ నగర్ లో నాకు 30 వేల మెజార్టీ ఇచ్చి మల్కాజిగిరి ఎంపీ గా గెలిపించారన్నారు. మీ అభిమానం తోనే తెలంగాణ కు ముఖ్యమంత్రి అయ్యానని, ఎల్బీ నగర్ కు వస్తే నా గుండె వేగం పెరుగుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ నా సొంత బంధువులు, అభిమానులు ఎక్కువ గా ఉంటారని, హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతంలో మెట్రోరైలు ను విస్తరిస్తామని, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వైపు, మియాపూర్ నుంచి రామచంద్ర పురం వైపు మెట్రో ను పొడగిస్తామన్నారు. 40 నుంచి 50 వేల కోట్ల తో మురికి కూపంలో మూసి ని ప్రక్షాళన చేస్తామన్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కాంగ్రెస్ నిర్మించింది కాబట్టే… ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ కు పేరు వచ్చిందన్నారు. ఓటర్ లోపల ఉన్న నగరం మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వైబ్రాంట్ 2050 పేరుతో మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని, రాబోయే 100 సంవత్సరాలకు సరిపోయే అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కి సహకరించవద్దు అని ఒకాయన కేంద్రానికి చెప్పారని, అలా చేస్తే మిమ్మల్ని నగర బహిష్కరణ చేస్తామన్నారు. ఈ నెల 11 న ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్ట బోతున్నామని, భద్రాచలం లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా ఫ్లై ఓవర్ లు నిర్మిస్తున్నామని, రాబోయే కాలంలో నగరం నాలుగు వైపులా అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. విజన్ 2050 ప్రణాళిక ను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆయన తెలిపారు.
