హైదరాబాద్ నగరవాసులకు మరో అద్భుతమైన ఆహ్లాదకర ప్రాంతం అందుబాటులోకి రానుంది. చారిత్రాత్మక నేపథ్యం ఉండి.. గతంలో ఆక్రమణల కోరల్లో చిక్కుకున్న బమృకున్-ఉద్-దౌలా చెరువు ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పునరుద్ధరించిన చెరువును ప్రారంభించి.. ప్రజలకు అంకితం చేయనున్నారు.
హైడ్రా కమిషనర్ ఏర్పాట్ల పరిశీలన..
ముఖ్యమంత్రి పర్యటన, ప్రారంభోత్సవ వేడుకల నేపథ్యంలో.. శనివారం ఉదయం హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ స్వయంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. చెరువు చుట్టూ కలియతిరిగి, అభివృద్ధి పనులను, సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పర్యటనలో హైడ్రా అదనపు కమిషనర్ శ్రీ ఆర్. సుదర్శన్ , ఏసీపీలు శ్రీ తిరుమల్, శ్రీ ఉమామహేశ్వరరావుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read:T20 World Cup Final Live Updates : ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ అమీతూమీ..
ఆక్రమణల నుంచి ఆహ్లాదకరమైన పార్కు వరకు..
ఒకప్పుడు ఈ చెరువు చుట్టూ అక్రమ కట్టడాలు వెలసి, వ్యర్థాలతో నిండిపోయి కేవలం 4.20 ఎకరాలకు కుంచించుకుపోయింది. కానీ.. హైడ్రా (HYDRAA) చొరవతో ఆక్రమణలను తొలగించి, చెరువును ఏకంగా 18 ఎకరాల భారీ విస్తీర్ణంలోకి తీసుకురావడం విశేషం. కేవలం పూడిక తీయడమే కాకుండా, మురుగునీరు చెరువులోకి చేరకుండా డైవర్షన్ పనులు చేపట్టి నీటిని స్వచ్ఛంగా మార్చారు.
Also Read:Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..
నగరవాసుల కోసం చెరువు చుట్టూ సుందరమైన నడక దారిని ఏర్పాటు చేశారు. వ్యాయామం కోసం ఓపెన్ జిమ్, పిల్లల ఆడుకోవడానికి ప్రత్యేక వసతులు కల్పించారు. పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి అందమైన గజబోలు (Gazebos), పచ్చని పార్కులను నిర్మించారు. వర్షాకాలంలో చెరువు నిండితే ఈ ప్రాంతం మరింత ఆహ్లాదంగా మారుతుందని అధికారులు వెల్లడించారు.
హైడ్రా కమిషనర్‌కు కాలనీ వాసుల సన్మానం
ఆక్రమణల తొలగింపు సమయంలో తమకు ఇంతటి అందమైన చెరువు అందుబాటులోకి వస్తుందని ఊహించలేదని రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా పనితీరుకు ఇది నిదర్శనమని కొనియాడుతూ.. కమిషనర్ రంగనాథ్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. చెరువును మురికికూపం నుంచి రక్షించి, తమ ప్రాంత రూపురేఖలను మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
