సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో కొండగట్టుకు సీఎం కేసీఆర్ పయనమవుతారు. ఉదయం 9.40 గంటలకు కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అనంతరం అక్కడి నుంచి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు. అయితే.. 25 ఏళ్ల తరువాత తొలిసారి సీఎం హోదాలో కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్ విచ్చేస్తున్నారు.
Also Read : Godavari Express: బీబీనగర్ దగ్గర పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్
టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించక ముందు 1998లో ఆలయానికి వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్నారు. ఆలయాన్ని దివ్యక్షేత్రంగా రూపుదిద్దే క్రతువులో భాగంగా ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు ప్రకటించారు. ఇందులో భాగంగా చేపట్టాల్సిన పనులపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.సుమారు రెండు గంటల పాటు కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. స్వామివారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో కలిసి ఆలయాభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
Also Read : Bhatti Vikramarka: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది
కొండగట్టులో సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ యాస్మిన్ బాషా పరిశీలించారు. ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ రానున్న దృష్ట్యా నిన్న రాత్రి 8 గంటల నుంచి ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ యాస్మిన్ బాషా వెల్లడించారు.