బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆ మీటింగులో.. ఒక జాతీయ పార్టీగా బీజేపీ సాధించింది ఏమీలేదని విమర్శించారు. తాను అడిగిన 9 ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రధాని మోడీ సమాధానం చెప్పలేదని తప్పుపట్టారు. దేశాన్ని బీజేపీ పట్టిపీడిస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు వాళ్లు చేసిందేమీ లేదని, వాళ్ల దగ్గర సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రూపాయి విలువ 80కి ఎందుకు పడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 8 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందని నిలదీశారు. ఏ రంగంలో ఏం సాధించారో చెప్పాలని అన్నారు.
ఇంత అసమర్థమైన పరిపాలన అందించినందుకు సిగ్గుపడాలని హితవు పలికారు. ‘దేశానికి కరెంట్ ఇవ్వటం మీకు చేతగాదు. మంచి నీళ్లు ఇచ్చే తెలివితేటలు కూడా లేవు. గుజరాత్ సీఎంగా మోడీ అడిగిన ప్రశ్నలనే ఇప్పుడు నేను అడుగుతున్నా. దేశ భవిష్యత్‌కి అవసరమైన దార్శనికత బీజేపీ దగ్గరలేదు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. రాజకీయ ప్రసంగాలు చేసి వెళ్లిపోయారు. ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది. సంవత్సరానికి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవటం ఏంటి. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ని సెలెక్ట్ చేసుకుంటారా?.
ఇక్కడికొచ్చి ఇక్కడి ప్రభుత్వాన్ని తిట్టిపోవటం మీ సంస్కారమూ?. డబ్బాలో రాళ్లు వేసి తిప్పినట్లు లొడలోడ వాగటమేనా మీరు సాధించింది?. బీజేపీ తెలివితక్కువతనంతో దేశాన్ని నాశనం చేశారు. ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని నేనెప్పుడూ చూడలేదు. దేశ రాజధానిలో మంచి నీటి కొరత ఉన్న మాట వాస్తవం కాదా?. తెలంగాణలో జరుగుతున్న పురోగతిలో 20 శాతమైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా?. కేంద్ర ప్రభుత్వానివి దద్దమ్మ విధానాలు. మోడీ ఒక్క మంచి పని కూడా చేయలేదు. మీ చెత్త విద్యుత్ విధానం వల్ల జాతీయ రాజధానిలోనే చీకట్లు కమ్ముకున్నాయి.
డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని బీజేపీ అంటోంది. ఈ విషయంలో ఆ పార్టీని మెచ్చుకోవాలి. కేంద్రంలో బీజేపీని దించి తీరతాం. కేంద్రంలో బీజేపీ పోయి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశ ప్రజలను నిరాశపర్చాయి. బీజేపీ పాలనలో భయంకరమైన కుంభకోణాలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ఒకాయన లుంగీ కట్టుకొని వచ్చాడు. ఆయన ప్రసంగాన్ని విని మనం తరించాలంట. బీజేపీకి అహంకారం బాగా పెరిగిపోయింది. అనారోగ్యకరమైన విధానాలను పాటిస్తోంది. సుప్రీంకోర్టును కూడా లెక్కచేయలేనంత కండకావరమా?
సుప్రీంకోర్టు లక్ష్మణ రేఖ దాటిందంటూ ట్రోలింగ్ చేస్తారా?. నుపుర్ శర్మ వ్యాఖ్యలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి సెల్యూట్ చేస్తున్నా. ప్రస్తుతం మన దేశంలో అన్‌డిక్లేర్డ్ ఎమర్జెన్సీ నడుస్తోంది. ఇందిరాగాంధీ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అమలుచేశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయింది. బీజేపీ నేత లక్ష్మణ్‌కు కట్టప్ప గురించి మాట్లాడేంత తెలివి ఉందా?. బీజేపీకి కళ్లు నెత్తికెక్కాయి. న్యాయవ్యవస్థ మీద గౌరవం లేదు. బీజేపీకి ఏం చేతకాదు. కట్టప్ప కాకరకాయ వచ్చి తెలంగాణలో ఏం పీకుతారు?. దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు?
అన్ని రంగాల్లో విఫలమయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తెలంగాణ ప్రజలను అవమానించారు. కేంద్రంలో బీజేపీయేమన్నా పర్మనెంట్‌గా ఉంటుంది. ప్రముఖ జర్నలిస్టులను నక్సలైట్లుగా చిత్రీకరిస్తారా? ఏక్‌నాథ్ షిండేలు వస్తారని గొప్పగా చెప్పుకుంటారా? మీరు ప్రజాస్వామ్య హంతకులు కాదా? మీ ఉన్మాదం, మీ పిచ్చి ఎక్కడిదాక పోతది? జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లపై మీకు అంచనాలు ఉన్నాయా? దేశంలో డెవలప్ అవుతున్న రాష్ట్రాలకు అడ్డుపడకండి అని చెప్పాను. దేశంలో ఏ మూలన వికాసం జరిగినా దేశ వికాసమే కదా? మంచి మాట చెప్పినా గౌరవించలేదు.
నీచమైన ఆలోచనలు చేస్తున్నారు. దేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటున్నాం. పండుతున్న పంటలు కొనటం బీజేపీకి చేతకాదు. రైతుబంధు ఇవ్వటం ఆ పార్టీకి చేతనవుతుందా?. తెలంగాణలో అన్ని వర్గాలను పొట్టలో పెట్టుకుంటున్నాం. మీ చేతకాని బీజేపీ మాకు కావాల్నా? కరెంట్ కోతల్ని తెచ్చుకోవటానికా? దేనికి మాకు బీజేపీ కావాలి?. బ్యాంకు లూటీ పెద్ద కుంభకోణం. మోడీకి తెలిసే జరుగుతున్నాయి?. బ్యాంకు దొంగల్ని పట్టుకోవటం మీకు చేతనవుతుందా?. ఎన్‌పీఏల్లో మీ వాటా ఎంత మోడీ గారు?.
రైతులకు కరెంట్ సబ్సిడీ ఇవ్వొద్దా?. మొన్నీమధ్య కూడా ఒక బ్యాంక్ దోపిడీ జరిగింది. దీనికి మోడీ రాజీనామా చేస్తారా? నిర్మలా సీతారామన్ రిజైన్ చేస్తారా? బ్యాంకు దొంగల్లో ఒక్కడినైనా తీసుకొచ్చారా? దేశంలో వంద సంవత్సరాలకు సరిపోయే బొగ్గు నిల్వలు ఉన్నాయి. అయినా బయటి నుంచి ఎందుకు కొనాలని ఒత్తిడి చేస్తున్నారు? ఇది అతిపెద్ద కుంభకోణం. మీ మెడలు వంచి దర్యాప్తు జరిపిస్తాం’ అని సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు.