NTV Telugu Site icon

CM KCR : ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్

Cm Kcr

Cm Kcr

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో జరిగిన పని ప్రతి ఊరిలో, పట్టణంలో మీకు కనిపిస్తుందని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. 58 ఏళ్లు గొడగొడ ఏడ్చినం. కరువుతో వలసలు పోయినమని, ఇదే నియోజకవర్గానికి చెందిన రాంచంద్రపూరంలో ఓ రైతు బోర్లు వేసి నీళ్లు పడక అక్కడే చనిపోయాడన్నారు సీఎం కేసీఆర్‌.

అంతేకాకుండా..’తాగు, సాగునీరు లేదు. కరెంటు లేని రోజులు చూసాం. కొండగట్టుఅంజన్న కొలువైన నియోజకవర్గం చొప్పదండి. ఈ మధ్యనే అక్కడి వచ్చాను. ప్లాన్లు రెఢీ చేస్తున్నాం. వెయ్యి కోట్లైనా సరే ఖర్చు చేసి కొండగట్టుఆలయాన్ని బ్రహ్మాండగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు రైతుల బాధలు పొయేలా మనం ప్రణాళికలు రచించుకుని ముందుకు పోతున్నాం. భారతదేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా రైతుబంధు పేరుతో రైతులకు పెట్టుబడి, దురదృష్టవాశాత్తు రైతు చనిపోతే రైతుబీమా ఇస్తున్నాం. ఇక్కడ వరదకాలువ, కాకతీయ కాలువ ఉన్నా ఎన్ని ఎకరాలకు నీరందేదో తెలుసా? వరదకాలువకు మోటార్లు పెడితే అప్పట్లో ఆ మోటర్లను తీసి నీళ్లలో పారేసేవాళ్లు. ఇప్పుడా బాధ ఉందా? కరెంట్ 3 గంటలు చాలట. అందుకోసం 10 హెచ్.పి. మోటార్ పెట్టుకోవాల్నట. మీకు 24 గంటలు కావాలా…? 3 గంటలు కావాలా? ఎన్నిగంటలిచ్చే పార్టీ గెలవాలో మీరే నిర్ణయించాలి. రైతుబంధు వేస్ట్ అనే పార్టీ కావాలా? ఇచ్చే పార్టీ కావాలా? రవిశంకర్ ను గెలిపిస్తే రైతు బంధు 16 వేలకు తీసుకుపోతాం. గ్రామాలలో మరో డేంజర్… ధరణిని తీసేస్తరట. తీసేస్తే మీ భూములకు రక్షణ ఉండదు. ఇయ్యాల మరో పథకం తెస్తామని మళ్ళీ మానిఫెస్టోలో చెప్పారు.

భూ భారతి తెస్తారట. అది పాతదే. 30 ఏండ్ల కిందనే తెస్తే దాంతోటి ఏమీ కాలేదు. ధరణి ఉంటేనే రైతు బంధు వస్తుంది. తీసేస్తే ఏ పద్ధతిలో ఆ డబ్బులొస్తాయి. మళ్లీ పైరవీకారుల రాజ్యమొస్తుంది. రైతులకు మేలు చేసేటోడు కావాల్నా… కిందిమీద చేసేటోడు కావాల్నా? కర్ణాటకలో 20 గంటల కరెంటు ఇస్తామని నరికీర్రు. ఇప్పుడు 5 గంటలు కూడా ఇస్తలేరు. 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్టానికి వచ్చి 5 గంటలు ఇస్తామని అక్కడి ఉప ముఖ్యమంత్రి చెబుతున్నడు. ఆ సన్నాసికి ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తదని తెల్వది. వాళ్లు బాజాప్తా చెబుతున్నారు. మూడు గంటలే కరెంట్ ఇస్తమని. అట్లా చెప్పంగ కూడా మీరు ఓటేస్తే… మీ పరిస్థితి వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లైతది. కేసీఆర్ కంటే దొడ్డుగున్నోళ్లు సీఎంలుగా పనిచేసి కనీసం మంచి నీళ్లు కూడా మనకు ఇవ్వలేదు.

ఆడబిడ్డ బిందె పట్టుకుని బజార్ల కనిపిస్తే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్నని చెప్పిన. ఇప్పుడు మంచిగా నీళ్లుస్తున్నం. ఇపుడు 24 గంటల పాటు నీళ్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. మీరు మోసపోతే పదేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మునుపు నీళ్లు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుంది. ఇలాంటివన్నీ ఆలోచించాలి. జుట్లు, జుట్లు ముడేసి మనకు గొడవలు పెట్టారు తప్ప రైతుల క్షేమం కోరలేదు. ఎలక్షనొస్తే ఆగంఆగం కావద్దు. ఎవడో చెబితే వినొద్దు. పదమందితో కలిసి ఆలోచన చేసి ఓటేయాలి. గోపాల్ రావు పేట, గర్షకుర్తి గ్రామాలను మండలాలు చేయాలన్న డిమాండ్లు తీరుస్తాం. ఇవేమీ పెద్ద పనులు కాదు. నేటితో 57 మీటింగులు పూర్తయినయ్. ఎక్కడికిపోయినా మంచి స్పందన వస్తోంది. మనమే గెలుస్తున్నాం.’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.