Site icon NTV Telugu

CM KCR: సృజనాత్మకంగా ఆలోచిస్తేనే ప్రజల ఆదరణ

Kcr

Kcr

ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి కృషి తో సామాజికాభివృద్ధి. తెలంగాణ స్వయం పాలనలోని ప్రగతి సమిష్టి కృషికి నిదర్శనమని సిఎం కేసీఆర్ తెలిపారు. ఫలితాలు రాబట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషి ఇమిడి వుందన్నారు. సాధించినదానికి సంతృప్తిని చెంది ఆగిపోకుండా ఇంకా గొప్పగా ఆలోచించాలని సిఎం అన్నారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిన నాడే గుణాత్మక ప్రగతిని మరింతగా ప్రజలకు చేరవేయగలుగుతామని ప్రభుత్వాధికారులకు సిఎం పునరుద్ఘాటించారు. రోటీన్ గా అందరూ పనిచేస్తరు కానీ మరింత గొప్పగా ఎట్లా పనిచేయాలనేదే ముఖ్యం అన్నారు సీఎం.

నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పని చేయగలమని ప్రతిరోజు ఆలోచించాలె. వొక పనిని ఎంత శాస్త్రీయంగా జీవించి, రసించి, ఆలోచించి చేస్తున్నం అనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదుగగలం. మూస ధోరణులను సాంప్రదాయ పద్దతులలో కాకుండా వినూత్న పద్ధతుల్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. అందుకు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాల్సి వుంటుంది.’’ అని సిఎం అధికారులకు వివరించారు. అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిన అవసరముంది.

తెలంగాణలో పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజలకు అందాల్సిన నాణ్యమైన సౌకర్యాల కోసం అందరం కలిసి పని చేయాలి. ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేని సందర్భాల్లోంచి నేడు అన్ని రంగాల్లో గుణాత్మకాభివృద్ధిని తెలంగాణ సాధించింది. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు ప్రజల అనుభవంలోకి వచ్చినయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గుణాత్మకంగా ప్రగతిని సాధించింది. తదనుగుణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు నేడు ఆర్థికంగా బలపడుతున్నాయి. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి ద్వారానే..ఇవన్నీ సాధ్యమైతున్నయి. తద్వారా ప్రభుత్వాలనుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు.

Read Also: Maharashtra: మోర్బీ ఘటన మరవకముందే.. చంద్రపూర్‌లో కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్..

వారికి మరింత నాణ్యమైన ఉత్తమమైన సేవలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులమీదనే వుందని సిఎం కెసిఆర్ అన్నారు.పౌర సౌకర్యాల పెంపుకోసం రోజు రోజుకూ డిమాండు పెరుగుతుందంటే, మన ప్రభుత్వం మీద ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని సిఎం అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాలిన అవసరమున్నదని ఉద్యోగులతో సిఎం అన్నారు. ‘‘ఒకప్పుడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానాలు తదితర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా వుంటున్నాయి. తెలంగాణ నుంచి బయటకు పోయిన వలసలు నేడు రివర్సయినయి. దాదాపు 30 లక్షల మంది పక్క రాష్ట్రాలనుంచి తెలంగాణకు వలసవచ్చి బతుకుతున్న పరిస్థితి వున్నది. స్వరాష్ట్రంలో రాబడులు పెరిగి ఆర్థిక వనరులు పెరిగినాయి.

పరిపాలనా సంస్కరణలతో గడప గడపకూ పాలనను తీసుకుపోతున్నాం అన్నారు. ప్రభుత్వం కృషితో అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణలో అన్ని శాఖలల్లో పని పరిమాణం పెరిగింది. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలి. పెరిగిన అభివృద్ధికి సమాన స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి వుంటది. ’’ అని సిఎం స్పష్టం చేశారు.ప్రజల ప్రాథమిక అవసరాలను నిత్యావసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రభుత్వోద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలని సిఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన నాటికి ఉమ్మడి పాలనలో శిధిలమై వున్న అన్ని రంగాలను తీర్చిదిద్ది నేడు వాటిని వొక ట్రాక్ మీదకు తీసుకురాగలిగామన్న సిఎం,. ప్రారంభ దశలో వున్న ఆందోళన ఇప్పడు అక్కరలేదన్నారు. అన్ని రంగాలు వాటంతంట అవి పనిచేసుకుంటూ పోయే స్థితికి తెచ్చుకున్నామన్నారు.‘‘ గతంలో వానాకాలం రెండు మూడు నెలలు మాత్రమే వుండేది. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. నిత్యం వానలతో నిర్మాణాత్మక పనుల నిడివి కూడా తగ్గింది. వర్షాలు లేని ఆరేడు నెలలలోనే మనం అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకోవాల్సి వున్నది.’’ అని తెలిపారు.

Read Also: Snake Stolen Chappal: ఇదేం పామురా బాబూ.. చెప్పుతో పరార్

Exit mobile version