NTV Telugu Site icon

CM KCR: యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి..

Cm Kcr

Cm Kcr

CM KCR: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. ఈ మేరకు యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించారు. ఇందుకోసం సోమవారం కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి, అవసరమైన ఏర్పాట్లు, కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా రేపు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్​ శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే ఈసారి ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటిని ప్రారంభించి, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొనుగోళ్ల విషయంలో సోమవారం జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కొనుగోళ్లకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై దిశానిర్ధేశం చేయనున్నారు.

Read Also: RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. ఆందోళనలో ప్రయాణికులు

ఇప్పటికే పలు జిల్లాల్లో యాసంగి వరి కోతలు మొదలైన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తాజా నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. గతంలో మాదిరిగానే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళారులకు విక్రయించి మోసపోకుండా మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా 7 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఖాతాల్లో జమచేస్తోంది. ఈ సారి గ్రేడ్‌ వన్‌కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ధరను ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: Telangana Government : జీవో నెం.4 ఎక్సైజ్‌, ప్రొహిబిషన్ శాఖకు వర్తించదు

ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో సుమారు 1.30 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో సుమారు 80-90 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. అంతకు మించి వచ్చినా సరే కొనుగోలు చేసేందుకు అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సుమారు రూ.15 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. రైతులు తమ ధాన్యం విక్రయించిన వారం రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి కేంద్రంలోనూ అవసరమైన టార్పాలిన్లు, ధాన్యం తూర్పారపట్టే యంత్రాలు, హమాలీలు, గోనె సంచులు ఇలా అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే కాంటా పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.

Show comments