CM Jagan: చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశారని.. మరి ఆయన చేసిన ఒక మంచి పనైనా గుర్తుకు వస్తుందా సీఎం జగన్ ప్రశ్నించారు. ఆయన మార్క్ పథకం ఏదీ లేదని.. ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్ను పోట్లు.. అబద్ధాలు.. కుట్రలు, కుతంత్రాలు అని విమర్శించారు. అందుకే నా అనేవాళ్ళు కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం పక్క రాష్ట్రంలో ఉన్నారన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నాయుడుపేట బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్ మామ అని చిన్నారులు ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారని.. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల భవిష్యత్ మార్చేందుకే 58 నెలలు కష్టపడ్డానని సీఎం తెలిపారు.
Read Also: Perni Nani: బీజేపీలో టీడీపీ దొంగలు పడ్డారు.. పురంధేశ్వరిపై పేర్ని నాని ఫైర్
58 నెలల్లో మనం మంచి సమాజాన్ని నిర్మించామని.. ఈ సమయంలో మంచి చదువులు చదువుకోవడానికి మార్గం సుగమం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే నాణ్యమైన విద్యను అందరికీ అందించామన్నారు. తాను వేసిన విత్తనాలు మరో 15 సంవత్సరాల్లో పెద్ద వృక్షాలుగా ఎదుగుతాయన్నారు. పెద్దింటి పిల్లలకు అసూయ పుట్టేలా పేద పిల్లలు ఎదుగుతారన్నారు. కుట్రలు, పొత్తులు, ఎత్తులు, జిత్తులు తెలియవని.. కుటుంబాలకు మంచి జరిగింది కాబట్టే ధైర్యంగా మీ ముందుకు వస్తున్నామన్నారు. అందుకే మీ ఆశీస్సులు కోరుతున్నామన్నారు. 2024 ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్పనని, మోసాలు చేయమన్న సీఎం జగన్.. అమలు చేయలేని హామీలను మేనిఫెస్టోలో పెట్టనన్నారు. జగన్ అమలు చేయలేని ఏ స్కీము కూడా చంద్రబాబు వల్ల కాదు.. ఎవరూ అమలు చేయలేరన్నారు. కిచిడీ మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పే మాదిరిగా పోటీ పడమన్నారు సీఎం జగన్. ఎప్పుడైనా నిజాయితీ, నిబద్ధతతోనే ఏదైనా హామీలు ఇస్తామన్నారు. చంద్రబాబు లాగా అబద్ధాలు.. మోసపు హామీలు ఇవ్వమన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు లీడర్ అనేవాడు ఆదర్శంగా ఉండాలన్నారు. రంగు రంగుల హామీలతో మేనిఫెస్టోను తీసుకు వచ్చి.. చెత్త బుట్టలో వేసే విధానం మనది కాదన్నారు. తాను అబద్ధం చెప్పనని, మాట ఇస్తే అమలు చేస్తామన్నారు. 58 నెలల పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేశామని సీఎం చెప్పారు. భవిష్యత్తులో కూడా అవసరాన్ని బట్టి ప్రతి ఇంటికి చేయగలిగిన మంచిని చేస్తామన్నారు.
Read Also: Janasena: పవన్ సంచలన నిర్ణయం.. రైల్వేకోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థి మార్పు
చంద్రబాబును నమ్మొచ్చా అని మీరు ఒకసారి ఆలోచించాలన్నారు. 2014 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి.. ఆయనతోపాటు ముగ్గురుని తెచ్చుకున్నాడని.. ముగ్గురి ఫొటోలు పెట్టి సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపారన్నారు. రైతులకు, పొదుపు సంఘాలకు పూర్తి రుణమాఫీ అన్నారని.. చేశారా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నారు.. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్నారు.. చేశారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే డబ్బులు డిపాజిట్ చేస్తానని చెప్పారు.. ఒక్క రూపాయి కూడా చేయలేదన్నారు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు.. ఇవ్వలేకపోతే ఇంటింటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి వస్తానని హామీ ఇచ్చారు.. అమలు చేసారా అంటూ జగన్ ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం అన్నారు…ఇచ్చారా.. ఒక్క సెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి నగరంలో హైటెక్ సిటీ కట్టిస్తానన్నారు.. ఎక్కడ కట్టించారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మళ్లీ కూటమిగా ఏర్పడి మరో రంగు రంగుల మేనిఫెస్టో తీసుకువస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళు అవసరమా అని ప్రజలను అడుగుతున్నానన్నారు. వారి మోసాల నుంచి పేదల భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో అందరూ స్టార్ క్యాంపైనర్లుగా పని చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.