CM YS Jagan: ఏపీలో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ పార్టీ.. వై నాట్ 175.. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల నినాదం ఇదే.. ఎవరెవరు కలిసినా.. ఎంత మంది తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా.. తనదే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో.. ప్రజాప్రతినిధులను, నేతలను, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు సీఎం జగన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రేపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. ‘సిద్ధం’ భారీ బహిరంగ సభ సర్వం సన్నద్ధమైంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు రానున్న నేపథ్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.
Read Also: YSRCP 6th List: వైసీపీ ఆరో జాబితా విడుదల
రేపు మధ్యాహ్నం సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. బహిరంగ సభలో కేడర్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. మరో వైపు సీఎం సభకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే తీరుతో అక్కడి పార్టీ నేతల్లో గందరగోళం నెలకొంది. అటు మైలవరం క్యాడర్‌ను తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గ పరిశీలకుడు పడమట సురేష్ బాబు. మరో వైపు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పు ప్రచారంపై ఈ నెల 4 లేదా 5వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు ప్రకటిస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.