CM YS Jagan: సంక్రాంతి తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు జిల్లాల చొప్పున సీఎం పర్యటించనున్నారు. ఈ పర్యటనల కోసం రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో వైసీపీ సర్కారు ఏం చేసిందో.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామని విషయాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈ పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకునేలా జిల్లాల నాయకులకు ఇప్పటికే సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అటు పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలందరూ ప్రజల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక సమావేశాల నిర్వహణకు వైసీపీ సిద్ధమైంది. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదక కానున్నట్లు తెలిసింది.
Read Also: Andhrapradesh: అంగన్వాడీ సంఘాలతో కొలిక్కిరాని ప్రభుత్వ చర్చలు
వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 దిశగా వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వైసీపీ పలు మార్పులతో కూడిన జాబితాలను సిద్ధం చేస్తూ వస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ఇంఛార్జులను మార్చారు. 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా కొత్త ఇంఛార్జులను నియమించారు. ఆరు లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన నియోజకవర్గాలపైన కూడా సీఎం దృష్టి పెట్టారు. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేశారు. పలువురికి సీట్లు నిరాకరించారు. తాజాగా మరో జాబితాపైనా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత నాలుగో జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నాలుగో లిస్టులో ఎవరు పేరు ఉంటుందో..ఎవరి పేరు ఉండదోనని మిగిలిన ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుందో చూడాలి.
మొదటగా సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇక నాలుగు నుంచి ఆరు జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్‌కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
