Site icon NTV Telugu

Vizag Capital: చకచకా విశాఖకు జగన్.. మార్చినుంచి అక్కడే మకాం

Cm Jagan

Cm Jagan

విశాఖ రాజధాని కాబోతోందన్నా సీఎం జగన్ ఢిల్లీ కామెంట్ల తర్వాత విశాఖలో హంగామా మొదలైంది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నా అని దేశరాజధాని సాక్షిగా ప్రకటించేశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ పరిపాలన త్వరలో విశాఖపట్టణం నుంచి సాగనుంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై అధికార యంత్రాంగం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ మౌఖికంగా మాత్రం ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండేందుకు బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.

Read Also: Tues Day Hanuman Chalisa Live: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే..

వీవీఎంఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ పక్క నుంచి రహదారి విస్తరణ పనులు చేపట్టడాన్ని బట్టి చూస్తే సీఎం నివాసం ఈ దారిలోనే ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు, మంత్రులు కూడా తమకు అనుకూలమైన ఇళ్ల కోసం గాలిస్తున్నారు. మూడు రాజధానుల ముచ్చట ఒక కొలిక్కి రాలేదు. సుప్రీంకోర్టులో విచారణ త్వరలో జరగనుంది. పరిపాలనా కార్యాలయాల తరలింపు ఎప్పటికి జరిగినా.. అక్కడ తన క్యాంపు కార్యాలయాన్నైనా ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్‌ యోచిస్తున్నట్లు సమాచారం.

మూడు రాజధానుల విషయంలో ఏదో ఒకటి చేశామనిపించుకోవాలని భావిస్తున్నారు. మార్చి మూడోవారంలోనే విశాఖలో సీఎం క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనకు ముందే విశాఖకు తాను రాబోతున్నట్టు, క్యాంప్ కార్యాలయం చూడండని జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లా యంత్రాంగం అత్యంత గోప్యంగా సీఎం క్యాంప్‌ ఆఫీసుకోసం భవనాల అన్వేషణ జరుపుతోంది.

దీనిని రుషికొండపైన నిర్మిస్తున్న పర్యాటకశాఖ ప్రాజెక్టు భవనాల్లో ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. కానీ… వచ్చే నెల మూడో వారానికి రుషికొండపై నిర్మాణాలు పూర్తికావని అధికారులు అంటున్నారు. తాత్కాలికంగా రుషికొండ, ఐటీ హిల్స్‌, మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం నాలుగైదు భవనాలను పరిశీలించారు. బీచ్‌ రోడ్డులోని కొన్ని భవనాలతోపాటు… ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉప కులపతి, రిజిస్ట్రార్‌ బంగ్లాలను కూడా పరిశీలించారు. ఈ అన్వేషణ మొత్తం గోప్యంగానే సాగుతోంది. త్వరలో ఈ అన్వేషణ పూర్తవుతుందని, జగన్ కు ఒక క్యాంప్ కార్యాలయం ఫైనలైజ్ అవుతుందని అంటున్నారు.

Read Also: office was set on fire: బోరుగడ్డ అనిల్ ఆఫీస్ కు నిప్పు.. అర్థరాత్రి హైడ్రామా

Exit mobile version