గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరగకుండా చూస్తున్నాం అన్నారు సీఎం జగన్. తిరువూరులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపాలనపై మండిపడ్డారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల వల్ల ఇంజినీరింగ్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2018–19లో 87,439 మంది పిల్లలు ఇంజినీరింగ్ వంటి విద్యా కోర్సును చదవడానికి ఎంచుకుంటే.. 2022–23 సంవత్సరానికి ఆ సంఖ్య ఏకంగా 1.20 లక్షల మందికి చేరిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. కారణం.. నా చదువులకు మా జగనన్న తోడుగా ఉన్నాడన్న భరోసా ఆ తల్లులకు, ఆ పిల్లలకు ఉంది కాబట్టే. ఇంటర్ ఉత్తీర్ణులై చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018–19లో చూస్తే 81,813 మంది అయితే.. మన ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల ద్వారా 2022–23లో ఆ సంఖ్య కేవలం 22,387కు మాత్రమే తగ్గిపోయింది. ఈ సంఖ్య కూడా ఉండకూడదు.. ఈ సంఖ్య సున్నా కావాలనే ఉద్దేశంతోనే మీ జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది.
2018–19లో 37 వేలుగా ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్లు 2021–22లో ఏకంగా 85 వేలకు పెరిగింది. ఇంటర్‌తో ఆపేసే విద్యార్థుల సంఖ్య దేశంలో సగటున చూస్తే 27 శాతం అయితే.. మన రాష్ట్రంలో అది కేవలం 6.6 శాతం అని చెప్పడానికి గర్వపడుతున్నా. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియా (జీఈఆర్) 17 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు కాలేజీల్లో చదవాలని జీఈఆర్ గురించి మాట్లాడుతారు. దేశం సగటున జీఈఆర్‌లో 2018–19లో 32.4 శాతం.. మన రాష్ట్రంలో 70 శాతానికి తీసుకెళ్లాలనే తపన, తాపత్రయంతో మీ బిడ్డ ముందుకు అడుగులు వేస్తాడని ప్రతి తల్లికి భరోసా ఇస్తున్నాను. ప్రతి అక్కకు మంచి తమ్ముడిగా, ప్రతి చెల్లికి మంచి అన్నగా మీ అందరికీ ఒక మాట చెబుతున్నా.. మీ పిల్లల చదువుల బాధ్యత నాదీ అని మాటిస్తున్నా.. అమ్మ ఒడితో మొదలుపెడితే విద్యా కానుక, గోరుముద్ద, నాడు–నేడు వంటి మంచి కార్యక్రమాలతో అడుగులు ముందుకేస్తున్నాం. పాఠ్యపుస్తకాలు బైలింగ్వెల్. ఒక పేజీ ఇంగ్లిష్, మరో పేజీ తెలుసు. స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా ఇంటరాక్టీవ్ ప్లాట్ ప్యానల్స్ అంటే డిజిటల్ క్లాస్‌రూమ్స్ కాబోతున్నాయి.
నాడు–నేడు పూర్తిచేసుకున్న 15,270 స్కూళ్లలో 6వ తరగతి పై ఉన్న స్కూళ్లు దాదాపు 5,800 స్కూల్స్. ఇందులో 30,230 క్లాస్ రూమ్స్‌లో ఇంటరాక్టీవ్ ప్లాట్ ప్యానల్స్ పెట్టి క్లాస్‌రూమ్స్ డిజిటలైజ్ కాబోతున్నాయి. 8వ తరగతిలోకి ఏ పిల్లాడు అడుగుపెట్టినా కూడా నా పుట్టిన రోజు పిల్లలను ఎప్పుడూ జ్ఞాపం ఉంచుకోవాలనే తపన, తాపత్రయంతో 8వ తరగతిలోకి వచ్చిన ప్రతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి 10వ తరగతి వరకు తీసుకెళ్తున్నాం. రెండు సంవత్సరాల సమయం ఇవ్వండి గవర్నమెంట్ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడలేవనే మాటను తుడిచేస్తా.. రెండు సంవత్సరాలు టైమ్ ఇవ్వండి.. కార్పొరేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీపడేలా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అన్నారు జగన్.
Read Also: CM JaganMohan Reddy: రెండేళ్ళ టైం ఇవ్వండి…మీ పిల్లల చదువు, భవిష్యత్ నాదే
అంతేకాదు.. వైద్య విద్యారంగంలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఉన్న 11 గవర్నమెంట్ కాలేజీలు కూడా నాడు–నేడుతో రూపురేఖలు మార్చుతున్నాం. ఇవన్నీ పిల్లల జీవితాలను బాగుచేయడానికి అడుగులు ముందుకేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను. నిండుమనసుతో ఈ బాధ్యతను నెరవేరుస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఒక ఇంట్లో ఉన్న అవ్వాతాతల పట్ల, అక్కచెల్లెమ్మల పట్ల, పిల్లల పట్ల, రైతుల పట్ల, సమాజంలో అణచివేతను ఎదుర్కొన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల, నిరుపేదల పట్ల ఇలా ప్రతి ఒక్కరిపట్ల నిండుమనసుతో స్పందించే హృదయం నాది. సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం వీటన్నింటినీ కర్తవ్యంగా, దైవ కార్యాలుగా భావించి ఈరోజు మన ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది.
దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్ ఎవరో మీకు తెలుసన్నారు. దుష్టచతుష్టయంతో మీ బిడ్డ యుద్ధం చేస్తున్నాడు. ఆ దుష్టచతుష్టయానికి సవాల్ విసురుతున్నా.. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే వారెందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని అడుగుతున్నా.. ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయని అడుగుతున్నా.. గ్రామ గ్రామానికి, ఇంటింటికీ అందిన అభివృద్ధి ఫలాల మీద, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, బడిపిల్లలకు, అవ్వాతాతలకు, అందించిన సంక్షేమ ఫలాల మీద మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేనివీరంతా మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు. వీరిని మరోసారి అడుగుతున్నా.. ఎన్నికల బరిలో మంచిచేసిన మనందరి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ముందా అని అడుగుతున్నా.. నా ప్రయాణం మీరే.. నన్ను నడిపించేదీ మీరే.. నా ప్రయాణంలో నిరంతరం ఎవరిపైనైనా ఆధారపడే పరిస్థితి ఉందంటే అది ఆ దేవుడి మీద, మీ అందరి మీదే. ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా చివరకు మంచే గెలుస్తుంది. రామాయణం చూసినా, మహాభారతం చూసినా అదే కనిపిస్తుంది, బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా అదే కనిపిస్తుంది. చివరకు గెలిచేది మంచిచేసిన వాడే గెలుస్తాడు. ఏ సినిమాకు వెళ్లినా.. ఆ సినిమాలో నచ్చేది హీరో మాత్రమే తప్ప విలన్లు నచ్చరని తెలియజేస్తున్నా. దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని, కొండంత అండగా నిలబడిన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు, నా అవ్వాతాతలు, నా అక్కచెల్లెమ్మలు, నా రైతన్నలు వీరందరూ నిండు మనసుతో నాకు తోడుగా నిలబడాలని, మంచి జరిగిన ప్రతి ఇల్లు కూడా మీ బిడ్డకు అండగా నిలవాలని నిండు మనసుతో కోరుకుంటున్నా అన్నారు జగన్.
Read Also: Amritpal Singh: పంజాబ్ లో హై అలర్ట్.. అమృత్‌పాల్ సింగ్ కోసం ముమ్మర గాలింపు.. అనుచరుల అరెస్ట్