AP CM Chandrababu: కోటి చెట్లు పెట్టాలని సంకల్పించామని.. కోటి చెట్లు పెడితే 0.33 శాతం మేర గ్రీన్ కవర్ పెరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. చెట్లు నాటే కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపట్టాలని సూచించారు. మంగళగిరిలోని ఎకోపార్క్‌లో వనమహోత్సవాన్ని మొక్కలు నాటి ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగించారు. స్కూళ్లల్లో చెట్లకు నీళ్లు పోయడమనేది అలవాటు చేసేవారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పచ్చదనం పెరిగితే స్వర్ణాంధ్ర ప్రదేశ్ కావడం ఖాయమన్నారు. భూమినే జలాశయంగా మార్చేలా ఇంకుడు గుంతల ద్వారా ప్రణాళికలు రచించామన్నారు. అడవుల్లో చెక్ డ్యాములు నిర్మించి.. భూగర్భ జలాలు పెంచేలా చేసేవాళ్లమని.. గత ప్రభుత్వం చెక్ డ్యాముల్లో మట్టిని కూడా తీయలేదన్నారు.
Read Also: Nimmala Rama Naidu: మంత్రి నిమ్మల, ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన ప్రమాదం
ఇప్పుడు పవన్ వచ్చారు.. అన్నీ చేస్తారని.. అటవీ శాఖ.. పీఆర్ శాఖలు పవన్ వద్దే ఉన్నాయన్నారు. రాజధాని నడిబొడ్డున ఎకో పార్కు ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోవాలని ఉందన్నారు. 2014లో మిషన్ హరితాంధ్ర ప్రదేశ్‌కు శ్రీకారం చుట్టామని.. 50 శాతం గ్రీన్ కవర్ ఏర్పడాలన్నారు. సీడ్ బాల్స్ ద్వారా చెట్ల పెంపకం చేపట్టాలని.. 175 నియోజకవర్గాల్లో నగర వనాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండున్నర ఎకరాల్లో నగర వనాలను ఏర్పాటు చేస్తామన్నారు. జపనీస్ టెక్నాలజీతో మియావాకీ కార్యక్రమం చేపడతామని.. మియావాకీ కార్యక్రమానికి నరేగా నిధులను అటాచ్ చేస్తామని సీఎం పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్, అడవుల నరికివేత, పార్కులు, చెరువులు, కాల్వలను కబ్జా చేసేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రకృతిలో పెనుమార్పులు వస్తున్నాయని.. కరవులు, తుపానులు, క్లౌడ్ బరస్ట్ వంటి విపత్తులు సంభవిస్తున్నాయని.. ప్రకృతి విపత్తులు పోవాలంటే చెట్లు నాటడమే ఏకైక మార్గమన్నారు.
బ్లూ అండ్ గ్రీన్ విధానంలో అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మనం ఎర్రచందనం చెట్లు పెంచితే.. గత ప్రభుత్వం స్మగ్లర్లను పెంచిందని విమర్శించారు. కొండలు తవ్వేశారు.. రుషులు ధాన్యం చేసే రుషి కొండను తవ్వేశారని వ్యాఖ్యానించారు. రవ్వలకొండ మీద బ్రహ్మం గారి కూర్చొని కాలజ్ఞానం రాశారని.. ఆ రవ్వల కొండని కూడా గత ప్రభుత్వం కొట్టేసిందని అన్నారు. రూ. 500 కోట్లతో ప్యాలెస్ కట్టారని.. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. తనకు అధికారం ఉందని పవన్ ఇక్కడో కొండని తవ్వి.. ప్యాలెస్ కడతానంటే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. పవన్ అలాంటి తప్పుడు పనులు చేయరని.. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే తాట తీస్తారని సీఎం అన్నారు. మాజీ సీఎం జగన్ ఎక్కడికైనా వస్తే చెట్లు కొట్టేస్తారని.. మేం అలా చేయం…చేయనీయమన్నారు.
Read Also: Vana Mahotsavam: వన మహోత్సవం.. మొక్కలు నాటి ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం..
గత ప్రభుత్వంలో ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. ఏం మాట్లాడాలన్నా అందరూ భయపడేవారని.. పవన్‌ను ఏపీకీ రానీయలేదని. రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారన్నారు. ఐదు కోట్ల మందికి నేనూ, పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్యం తీసుకు రాగలిగామన్నారు. ముంబై నటి కాదంబరిని వేధించారని.. ఫోర్జరీ సంతకాలతో కాదంబరిని అరెస్ట్ చేశారని సీఎం వ్యాఖ్యానించారు. రక్షణగా ఉండాల్సిన పోలీసులే దారుణంగా వ్యవహరించారన్నారు. గత పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే ఏం మిగలదన్నారు. వైసీపీ మళ్లీ వస్తే పిల్లల భవిష్యత్తు సర్వ నాశనం అవుతుంది.. రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. కొలంబియాలో ప్యాబ్లో ఎస్కోబార్ ఏ విధంగా చేసేవాడో.. గత పాలకులు అదే విధంగా చేశారని విమర్శించారు. ఖనిజ సంపద దోపిడీ ఆపుతామని, ఇసుక ఫ్రీగా ఇస్తామని సీఎం చెప్పారు. చెట్టు లేకుంటే జీవ రాశే ఉండదన్న ఆయన.. జీవ వైవిధ్యానికి ఏపీ చిరునామాగా ఉండాలన్నారు.
13 వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు, 3 నేషనల్ పార్కులు, 2 జూలాజికల్ పార్కులు, టైగర్ పార్కు, ఒక శ్యాంచూరి, మరో ఎలిఫెంట్ శ్యాంచూరి వచ్చే అవకాశం ఉందన్నారు. నాగార్జున-శ్రీశైలం మధ్య సఫారీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అడవులు విధ్వంసం చేస్తే వదిలి పెట్టమని హెచ్చరించారు. అడవులను నరకడానికి ఎవరైనా అడుగు పెడితే వారికి అదే చివరి రోజు అవుతుందన్నారు. పర్యావరణం, అటవీ సంపద రక్షణ కోసం డ్రోన్లను వినియోగిస్తామని సీఎం వివరించారు. ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని.. ఆ చెట్టుకు తల్లి పేరు పెట్టాలని సీఎం ప్రజలకు సూచించారు. పట్టాదారు పాసు పుస్తకంపై మాజీ సీఎం తన ఫొటోలు వేసుకున్నారని.. కానీ మీరు పెంచే చెట్లకు మీ తల్లి పేరే పెట్టాలని మేం చెబుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రతీ ఒక్కరూ కలసి రావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
దాదాపు కోటి మొక్కలు నాటే ప్రయత్నం శాఖా పరంగా చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం 29 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 50శాతం తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఈ మహాయజ్ఞాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని, ప్రతీ ఒక్కరూ కలసి రావాలన్నారు. గత ప్రభుత్వం ఇష్టారీతిన చెట్లను నరికేసిందన్న పవన్.. చెట్టుని కూల్చటం తేలిక, పెంచటం కష్టమని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. ఇవాళ నాటే ప్రతీ మొక్కా భావితరాల కోసమేనన్నారు. అడవి వాతావరణం పరిరక్షించుకుంటే తప్ప భవిష్యత్తు మనుగడ లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.