Site icon NTV Telugu

CM Chandrababu: పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా?.. ఎంపీ పుట్టా నిర్వాకంపై సీఎం ఫైర్!

Putta Mahesh Cm Chandrababu

Putta Mahesh Cm Chandrababu

తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రితో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. యువకుడిగా, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినందున అతనికి అవకాశం ఇచ్చామని, కానీ అతని ప్రవర్తన ఆశించిన విధంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

పుట్టా మహేశ్‌ యాదవ్‌ చేసిన తప్పునకు పార్టీ సమాధానం చెప్పుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘యువకుడని, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని పుట్టాకు అవకాశమిచ్చాం. కానీ ఈ విధంగా వ్యవహరించారు. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది?. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా?. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి పెద్ద వాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నా. క్రమశిక్షణ, విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు’ అని సమావేశంలో సీఎం అన్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని సీఎం సూచించినట్టు తెలిసింది.

Also Read: Most Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు.. అగ్రస్థానం ‘కింగ్’దే, టాప్-10లో అందరూ దిగ్గజాలే!

తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌లో పార్టీ చేసుకొంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌తో పాటు మరికొందరు దొరికిన విషయం తెలిసిందే. పార్టీలో తాము డ్రగ్స్‌ వాడలేదని నిందితులు చెప్పినా.. పోలీసుల పరీక్షల్లో మొత్తం 11 మందిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఆ ఆరుగురిలో ఎంపీ పుట్టాకు కూడా ఉన్నారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ ఘటనపై ఎంపీ పుట్టా మాట్లాడుతూ.. ఫామ్‌హౌస్‌లో డిన్నర్‌కు హాజరైన మాట నిజమే అని, ఎలాంటి తప్పు చేయలేదన్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తా అని, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటా అని చెప్పారు.

Exit mobile version