Site icon NTV Telugu

Collectors’ Conference: ఆరు జిల్లాల కలెక్టర్ల బెస్ట్ ప్రాక్టీసెస్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సీఎం ఆదేశాలు..

Collectors' Conference

Collectors' Conference

Collectors’ Conference: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పాలనను మరింత ప్రజోపయోగంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్సులో భాగంగా ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు తొలిసారిగా కొత్త విధానాన్ని అవలంభించారు. సాధారణ సమీక్షలకు భిన్నంగా, ఆయా జిల్లాల్లో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కలెక్టర్లే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేలా చేశారు. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

Read Also: Muslims vs RSS: ముస్లింలు సూర్య నమస్కారాలు, నదులను పూజించాలి.. ఆర్ఎస్ఎస్ నేత హాట్ కామెంట్స్

అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను వివరించారు. వీటిలో కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉన్నాయని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా రూపొందించిన ‘ప్రాజెక్ట్ నిర్మాణ్’ గురించి వివరించారు. పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి విద్యార్థులు పరిశుభ్రత, హైజినిక్ అలవాట్లు అలవర్చుకునేలా రూపొందించిన ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ నాటుసారా తయారీదారుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా, వారిని మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో రూపొందించిన ‘ప్రాజెక్ట్ మార్పు’ కార్యక్రమాన్ని వివరించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా రైతుల సాధికారత, ఆర్థిక లబ్ది, వ్యవసాయంలో ఉత్తమ విధానాల పాటన లక్ష్యంగా చేపట్టిన ‘ఛాంపియన్ ఫార్మర్స్’ కార్యక్రమాన్ని వివరించారు.

కడప జిల్లా కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లు గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ రెవెన్యూ రికార్డుల్లో ట్యాంపరింగ్‌కు తావు లేకుండా డిజిటలైజేషన్, ఏఐ వినియోగంతో రూపొందించిన వినూత్న ప్రాజెక్టును వివరించారు. జిల్లాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించడంలో విశేష కృషి చేస్తున్న కలెక్టర్లను సీఎం చంద్రబాబు అభినందించారు. రొటీన్ చర్చలకే పరిమితం కాకుండా ప్రజలకు నేరుగా ఉపయోగపడే అంశాలపై కాన్ఫరెన్సులో చర్చ జరగడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి మరిన్ని వినూత్న ఆలోచనలు, ప్రజోపయోగ కార్యక్రమాలతో రావాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ప్రోత్సహించారు.

Exit mobile version