NTV Telugu Site icon

CM Chandrababu Midnight Review: ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదలు.. అర్ధరాత్రి సీఎం సమీక్ష

Babu

Babu

CM Chandrababu Midnight Review: ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం వణికి పోతోంది. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షంతో కొండవాగులు పొంగుతున్నాయి. వరద నీరు రహదారుల పైకి రావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి 29 మీటర్లకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ప్రాజెక్టు 48 గేట్ల నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జంగారెడ్డిగూడెం నల్లజర్ల తాడేపల్లిగూడెం నిడదవోలు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటిమునగనున్నాయి. జల్లేరు తమ్మిలేరు జలాశయాలకు సైతం వరద నీరుకి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.

Read Also: Kavach System : గోండా రైలు ప్రమాదం.. కవాచ్ విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఇక, ఏజెన్సీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ ఆలయం సమీపంలో కొండ వాగులు పొంగడంతో పలువురు భక్తులు ఆలయంలో చిక్కుకుపోయారు. వారిని ఆలయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఏలూరు జిల్లాలోని ముంపు మండలాలైన వేలేరుపాడు కుక్కునూరు ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు.. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరద తీవ్రతపై అర్ధరాత్రి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో లేట్ నైట్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు.. వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు.. ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని సూచించిన ఆయన.. సాధ్యమైనంత వరకు పంట నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవాలన్నారు.. ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.