తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం అయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తియిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.
Also Read: Viral Video: భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదే.. లారీ కింద పడ్డా ఏమీ కాలేదు, స్కూటీ మాత్రం..!
రాష్ట్ర అధ్యక్షునితో పాటు స్టేట్ కమిటీ నియమించాలన్న అంశంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం చేసినట్లు సీఎం చంద్రబాబుకు నాయకులు వివరించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టివ్ గా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుని నియామకం ఆలస్యం అయ్యేటట్లు అయితే.. ఈ లోపు ముఖ్య నాయకులతో కలిపి రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు.. కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ యాక్టివిటీ పెంచాలని సూచించారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చే వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
