NTV Telugu Site icon

CM Chandrababu: రాష్ట్ర విభజన కంటే.. వైసీపీ ప్రభుత్వం వల్లే ఎక్కువ నష్టం: సీఎం చంద్రబాబు

Cm Chandrababu

Cm Chandrababu

2047 విజన్ అనేది వ్యక్తి కోసం, కులం కోసం కాదని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెచ్చేందుకు ఇచ్చే హామీ అని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ఇంత స్వేచ్చగా రాష్ట్రంలో మాట్లాడుకున్నామా? అని సీఎం ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశాలు ఇస్తే.. వాటిని వైసీపీ రద్దు చేసిందని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో అమరావతిపై కక్షతో వ్యవహరించారని, పోలవరంను నాశనం చేసి పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత ఉద్యమం వచ్చిందని, తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిందని సీఎం పేర్కొన్నారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్ర ప‌టానికి సీఎం చంద్రబాబు పూల మాల‌ వేసి నివాళుల‌ర్పించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చిందంటే పొట్టి శ్రీరాములు వలనే. తెలుగు జాతి కోసం ఆలోచించిన కొద్ది మందిలో పొట్టి శ్రీరాములు ఒకరు. దేశమంతా భాషా ప్రయుక్త రాష్ట్రాల వైపు వెళ్ళటానికి కారణం పొట్టి శ్రీరాములు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కూడా ఇవాళే. దేశాన్ని ఐకమత్యంగా ఉంచేందుకు కృషి చేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్. మేం మాటలు చెప్పటానికి లేము. హైద్రాబాద్ నగరంను తెలుగు జాతి కోసం తయారు చేశాం. పీవీ నరసింహా రావు, ఎన్టీఆర్ వంటి తెలుగు జాతి కోసం పనిచేసే వారిని గుర్తు పెట్టుకోవాలి. 2047 విజన్ అనేది వ్యక్తి కోసం, కులం కోసం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెచ్చేందుకు ఇచ్చే హామీనే 2047 విజన్’ అని అన్నారు.

‘గత ఐదేళ్లలో ఇంత స్వేచ్చగా రాష్ట్రంలో మాట్లాడుకున్నామా?. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశాలు ఇస్తే వాటిని వైసీపీ రద్దు చేసింది. 3 రాజధానుల పేరుతో అమరావతిపై కక్షతో వ్యవహరించారు. పోలవరంను నాశనం చేసి పక్కన పెట్టారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. 2019లో మీ ఆస్తులను రాసుకొనే పరిస్థితి తెచ్చారు. రాష్ట్రం కోసం పనిచేసిన వారిని గుర్తు పెట్టుకోవడం మాత్రమే కాదు.. 2019 నుంచి 2024 వరకు జరిగిన పరిపాలన కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇంత అనుభవం ఉన్నా.. నాకు ఒకోసారి ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో రాష్ట్రాన్ని గత ఐదేళ్లు పాలించారు. నేను, పవన్ కళ్యాణ్ కూడా గత ప్రభుత్వ బాధితులమే. కేంద్రంలో మన పరిమితి పెరిగింది కాబట్టి మనకి అప్పుడప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నారు. లేకపోతే చాలా ఇబ్బంది పడే వాళ్ళం’ అని సీఎం తెలిపారు.

‘వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 125 జయంతి వేడుకలు ప్రారంభం అవుతాయి. 125 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. పొట్టి శ్రీరాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, ఆయన ఉన్న ఇంటిని మెమోరియల్ గా మారుస్తాం. 25 ఏళ్ల ముందే నేను ఐటీ ప్రారంభించాను. రైస్ మిల్లో ధాన్యం దించగానే రైతులకి డబ్బులు పడేలా మార్పులు తెస్తాం. వాట్సాప్ గవర్నెన్స్ త్వరలో తీసుకు వస్తున్నాము. రాష్ట్రానికి సుపరిపాలన అందించేమే ఎన్డీయే కూటమి లక్ష్యం. ఒకప్పుడు రాష్ట్రానికి అప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు అప్పులు చేయాలంటే అవకాశాలు లేవు. ఫైనాన్స్ కమిషన్ వేసి ఐదేళ్లకు డబ్బులు ఇస్తారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ డబ్బు వస్తాయని చూస్తున్నా. గత పాలకుడు ఐదేళ్ల డబ్బు ఒకేసారి తీసుకు వచ్చేశాడు. నాకు కూడా ఆశ్చర్యం వేసింది. రెండేళ్లు 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఏ డబ్బులు రాష్ట్రానికి రావు. అన్నీ దొంగ బిల్లులు, దొంగ బుద్ధులు’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

Show comments