NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..

Delhi

Delhi

NSUI Protest: ఢిల్లీలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) త్రివర్ణ పతాక ప్రదర్శనకు ముందు గురువారం రాత్రి రాజకీయ, పోలీసు వర్గాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కన్నాట్ ప్లేస్‌లో ఇవాళ జరగాల్సిన ‘లహరా దో తిరంగా’ మార్చ్‌ను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు భారీగా భద్రతను పెంచారు. మరోవైపు, మహిళా కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తూ, వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు రాత్రికి రాత్రే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వినోద్ జాఖడ్ సహా పలువురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.

ఢిల్లీ పోలీసు విభాగంలోని ఓ మహిళా అధికారి తమ సంఘానికి చెందిన మహిళా కార్యకర్తలపై చేయి చేసుకున్నారని, ఆమెపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్ చేస్తోంది. బుధవారం నాడు అదనపు డీసీపీ స్థాయి అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే తాము స్టేషన్ ఎదుట బైఠాయించాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు తమపైనే ఎదురుదాడికి దిగి అణచివేత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మహిళా కార్యకర్తలపై భౌతిక దాడి జరిగిందని, కొందరిని చీకటి గదిలోకి తీసుకెళ్లి బూట్లతో దారుణంగా కొట్టారని వినోద్ జాఖడ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తాము కేవలం చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మాత్రమే కోరామని, అధికారులు తమ గోడును అసలు పట్టించుకోలేదని వాపోయారు. మహిళా కార్యకర్తలకు న్యాయం చేయమని కోరడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.

ఇక మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నేడు సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌కు జాతీయ జెండాలతో భారీగా తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలనే డిమాండ్లతో ఈ మార్చ్‌కు పిలుపునిచ్చారు. కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ఎవరూ ఈ నిరసన మార్చ్‌లో పాల్గొనవద్దని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్‌ఎస్) సెక్షన్ 163 ప్రకారం ఆ ప్రాంతంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే, అడ్మినిస్ట్రేటివ్ కారణాలరీత్యా అక్టోబర్ 16, 17 తేదీల్లో సెంట్రల్ పార్క్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఎన్డీఎంసీ ప్రకటించింది. పోలీసులు తనను గురువారం రాత్రే లేదా ఇవాళ ఉదయం అరెస్ట్ చేసే అవకాశం ఉందని, దేశం కోసం, జెండా ఎగరేయడం కోసం జైలుకెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని అభిజిత్ దిప్కే గురువారం అర్ధరాత్రి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో స్పష్టం చేశారు. పోలీసులు, నిఘా వర్గాలు తన కదలికలను నిరంతరం గమనిస్తున్నాయని ఆరోపించారు.