CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..

Cockroach

Cockroach

ఇటీవల సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) సృష్టించిన హల్‌చల్ అంతా ఇంతా కాదు. కేవలం వారం రోజుల్లోనే ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టేసింది. మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన “కాక్రోచ్” (బొద్దింక) వ్యాఖ్య ఈ ఉద్యమానికి కారణమైంది. నిరుద్యోగులను ఆయన బొద్దింకలతో పోల్చారనే వార్తలు రావడంతో తీవ్ర దుమారం రేగింది. అయితే, తాను నకిలీ డిగ్రీలు ఉన్నవారిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశానని, దేశ యువతపై తనకు ఎంతో గౌరవం ఉందని మరుసటి రోజే ప్రధాన న్యాయమూర్తి స్పష్టతనిచ్చారు.

అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దీప్కే మే 16న X (ట్విట్టర్) వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పోస్టర్‌ను, ఒక గూగుల్ ఫామ్‌ను షేర్ చేస్తూ.. “బొద్దింకలు” అనుకునే వారంతా ఇందులో చేరవచ్చని పిలుపునిచ్చారు. ఇది కాస్తా విపరీతంగా వైరల్ అయ్యింది. లక్షకు పైగా మంది ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు.

రాజకీయ స్పందన..
ఈ వ్యంగ్య ప్రయోగానికి విపక్షాల నుంచి కూడా మద్దతు లభించింది. కొందరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తాము కూడా ఇందులో సభ్యులమని ప్రకటించగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ “BJP vs CJP” అంటూ ట్వీట్ చేశారు.

అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో పెరిగినంతగా X వేదికపై ఫాలోవర్లు పెరగకపోవడం, విదేశీ బాట్‌ల ప్రమేయం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొదట సరదాగా ప్రారంభమైనా, ప్రస్తుతం ఇదొక యువ విప్లవంగా మారిందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తమ పోరాటమని వ్యవస్థాపకుడు అభిజీత్ స్పష్టం చేశారు.