NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి గొప్పతనం మాటల్లోనే చెప్పుకునేది కాదు

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy : పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న ఎషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ ఛైర్మన్ డా. డి నాగేశ్వర్ రెడ్డిని సన్మానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వైద్యరంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించడం తెలుగు వారందరికి గర్వకారణమన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో వారు చేసినంత పరిశోధనలు, ఆవిష్కరణలు మరో డాక్టర్ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదని ఆయన కొనియాడారు. వారు స్వయంగా పరిశోధించి ఆవిష్కరించిన ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్స్ సరిదిద్దే నాగి స్టెంట్ ఇవ్వాల ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ప్రాణం పోస్తున్నదని, షుగర్ వ్యాధిగ్రస్తులను సైతం తన పరిశోధనలతో పునర్జన్మను ప్రసాదిస్తున్నారన్నారు.

 Abhishek Sharma: అభిషేక్ శర్మపై ఊరమాస్ కామెంట్.. నితీష్ రెడ్డి ఇన్ స్టా స్టోరీ వైరల్

డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి గొప్పతనం మాటల్లోనే చెప్పుకునేది కాదని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో నెంబర్ -1 గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ గా మన తెలంగాణ గడ్డమీద నుంచి సేవలందించడం మన అదృష్టమన్నారు. ప్రపంచంలో ఏ డాక్టర్ కు సాధ్యం కానీ విధంగా 5 ఎఎస్ జీఈ (ASGE) (అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ) క్రిస్టల్ అవార్డులు పొందిన ఏకైక ఎండోస్కోపిస్ట్ మన నాగేశ్వర్ రెడ్డి అని ఆయన అన్నారు. అమెరికన్ డాక్టర్లకు సైతం ఇది సాధ్యం కాలేదంటే వారి ప్రతిభను మనం అర్ధం చేసుకోవచ్చని, వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరొందిన జర్నల్స్ లో 1085 పరిశోధన పత్రాలను ప్రచురించారన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీలో విద్యనభ్యసించే వారి కోసం ముద్రించిన 50కి పైగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ (GI) పాఠ్యపుస్తకాల ముద్రణకు తన విజ్ఞానాన్ని ధారబోసారని, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి నాగేశ్వర్ రెడ్డి గారికృషిని గుర్తిస్తూ రావడం చాలా సంతోషమన్నారు.

గతంలో వారు 2002లో పద్మశ్రీ అవార్డు, 2016లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారని, ఇప్పుడు (2025) పద్మవిభూషణ్‌ అవార్డును అందుకున్నారని, వారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం నిజంగా తెలుగువారందరికి గర్వకారణమన్నారు. వారు రాబోయే రోజుల్లో నోబెల్ బహుమతి అందుకునే స్థాయికి చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని, అమెరికాలో అందించే.. ప్రతిష్టాత్మకమైన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ రూడాల్ఫ్ షిండ్లర్ అవార్డు పొందిన ఇద్దరు విదేశీయుల్లో నాగేశ్వర్ రెడ్డి ఒకరు అని ఆయన అన్నారు.

అంతేకాకుండా..’వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును అందుకున్న డాక్టరు. వారు నోబెల్ బహుమతికి అన్ని విధాల అర్హులని నేను భావిస్తున్నాను. ఎందుకంటే.. హెలికోబాక్టర్ పైలోరి బ్యాక్టీరియా.. గ్యాస్ట్రిటిస్ , పెప్టిక్ అల్సర్ కు కారణమవుతుందని కనుగొన్నందుకు బారీ మార్షల్ , రాబిన్ వారెన్ లకు 2005 లో నోబెల్ బహుమతి వచ్చింది. అలాగే, గ్యాస్ట్రిక్ జ్యూస్ లు (జీర్ణరసం) ఎలా స్రవిస్తాయి అనే విషయం కనుగొన్నందుకు ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్‌కు 1904లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. మరి, నాగి స్టెంట్ తో పాటు అనేక ఆవిష్కరణలు చేసిన డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డికి నోబెల్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు.’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

Eluru Election: ఏకగ్రీవంగా ఏలూరు కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ల ఎన్నిక