NTV Telugu Site icon

IPL 2025: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవ‌న్.. రోహిత్ శ‌ర్మ‌కు దక్కని చోటు!

Chris Gayle

Chris Gayle

వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల తరపున ఆడాడు. 142 మ్యాచ్‌ల్లో 4,965 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఆరు సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు బాదాడు. బెంగళూరు తరఫున రెండుసార్లు ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో గేల్ 357 సిక్సర్లు బాదాడు, ఇది ఇప్పటికీ ఓ రికార్డు. అంతేకాదు అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ రికార్డు ఇప్ప‌టికీ గేల్ (175) పేరిటే ఉంది. ప్రపంచంలోని పలు ఫ్రాంచైజ్ క్రికెట్ లీగ్‌లో తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన యూనివర్సల్ బాస్.. తాజాగా త‌న బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఎంచుకున్నాడు.

క్రిస్ గేల్ తన జట్టులో ఏడుగురు భార‌త ఆట‌గాళ్ల‌కు చోటు ఇచ్చాడు. విదేశీ కోటాలో తనతో పాటు ఏబీ డివిలియర్స్,డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్‌కు చోటిచ్చాడు. 12వ ఆటగాడిగా డేవిడ్ వార్నర్‌కు అవకాశం ఇచ్చాడు. యూనివర్స్ బాస్ త‌న టీంకు ఎంఎస్ ధోనీని సారథిగా ఎంచుకున్నాడు. అయితే ముంబై ఇండియ‌న్స్ ఐదు టైటిల్స్‌ను అందించిన రోహిత్ శ‌ర్మ‌కు ఈ జట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అలానే హార్దిక్ పాండ్యా కూడా గేల్ తన ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వలేదు.

క్రిస్ గేల్ తన జట్టు ఓపెనర్లుగా తనతో పాటు విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. 3వ స్థానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను ఎంచుకున్న యూనివర్సల్ బాస్.. 4వ స్థానంలో ఏబీ డివిలియర్స్‌కు అవకాశం ఇచ్చాడు. సర్ రవీంద్ర జడేజాను ఆల్ రౌండర్‌గా.. కెప్టెన్ అండ్ వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీని తీసుకున్నాడు. 7వ స్థానంలో డ్వేన్ బ్రావోకు స్థానం కల్పించాడు. సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్‌లను స్పిన్నర్లుగా.. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లను పేసర్లుగా ఎంచుకున్నాడు.

Also Read: Virat Kohli Retirement: రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ!

గేల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవ‌న్ ఇదే:
క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్. 12వ ఆటగాడు- డేవిడ్ వార్నర్.