Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్‌ పేరు ఖరారు!

  • టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
  • టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్‌, భాష్యం రామకృష్ణ
  • చివరి నిమిషంలో చింతకాయల విజయ్‌ పేరు ఖరారు
Tdp Rajya Sabha Candidates 2026

Tdp Rajya Sabha Candidates 2026

TDP Rajya Sabha Candidates 2026: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రాజ్యసభ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌, చింతకాయల విజయ్ పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం (జూన్ 8) నామినేషన్ వేయనున్నారు. సామాజిక సమతుల్యత, అంకిత భావం, యువతకు పెద్దపీట వేస్తూ ఈ ఎంపిక చేపట్టారని టీడీపీ స్పష్టం చేసింది. పార్టీతో అనుబంధం, చేసిన సేవలు పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్టు టీడీపీ పేర్కొంది.

రాజ్యసభ అభ్యర్థుల రేసులో అవకాశం దక్కని వారికి ఇతర పదవులు కేటాయిస్తామని టీడీపీ అధిష్ఠానం స్పష్టం చేసింది. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పదవి లభిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. సీఎం శనివారం రాత్రే ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులకు బీఫాంలు అందించారు.భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌ల అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు శుక్రవారం ఖరారు చేశారు. దాంతో మూడో స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై అందరిలో తీవ్ర ఉత్కంఠత కొనసాగింది. మూడో స్థానం కోసం సీనియర్‌ నేత వర్ల రామయ్య, చింతకాయల విజయ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించడంతో పాటు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్న టీడీపీ అధిష్ఠానం.. విజయ్‌కి అవకాశం ఇచ్చింది.

×
×
Ad

చింతకాయల విజయ్‌ తండ్రి అయ్యన్న పాత్రుడు స్పీకర్‌గా ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విజయ్‌ తన సేవలు అందించారు. ఇదే ఆయన అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మొగ్గు చూపడానికి కారణం. 2024 ఎన్నికల్లో విజయ్‌ అనకాపల్లి లోక్‌సభ టికెట్‌ ఆశించినా.. టికెట్‌ దక్కలేదు. అప్పటి రాజకీయ సమీకరణాలతో ఆయనకు అవకాశం దక్కలేదు. తన కుమారుడికి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు కూడా కోరారు. ఇటీవల కూడా తన తర్వాత తన కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కూడా కోరారు. అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తినీ సీఎం చంద్రబాబు పరిగణనలోకి తీసుకుని చివరకు విజయ్‌ను ఎంపిక చేశారు.