4,500 టన్నుల హైటెక్ చైనీస్ పరిశోధన నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత తిరిగి మాల్దీవుల జలాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జుకి చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్.. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే డ్రాగన్ రీసెర్చ్ షిప్ మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించడం చర్చనీయాంశమైంది.
భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు తలెత్తాక మాల్దీవులు.. చైనాకు దగ్గరవుతోంది. ఇటీవల డ్రాగన్ పరిశోధక నౌక వారం పాటు మాల్దీవుల జలాల్లో ఉండి వెళ్లిపోయింది. తిరిగి రెండు నెలల తర్వాత.. తాజాగా ఆ నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. చైనాకు చెందిన పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్-03 గురువారం ఉదయం తిలాఫుషీ ఇండస్ట్రియల్ హార్బర్‌లో లంగరేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ నౌక ఎందుకు తిరిగొచ్చిందన్న విషయాన్ని ముయిజ్జు సర్కారు వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: Spiderman: స్పైడర్ మ్యాన్ డ్రెస్సుల్లో రోడ్డుపై రెచ్చిపోయిన యువ జంట.. సీన్ కట్ చేస్తే..
దాదాపు 4,500 టన్నుల బరువున్న ఈ పరిశోధక నౌక.. ఈ ఏడాది జనవరిలో చైనాలోని సన్యా నుంచి బయల్దేరింది. దాదాపు నెల రోజుల పాటు మాల్దీవుల ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ సరిహద్దుల్లో తిరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న తిలాఫుషీ పోర్టుకు చేరుకుని దాదాపు వారం రోజుల తర్వాత అక్కడినుంచి తిరిగెళ్లింది. దాదాపు రెండు నెలల పాటు పలు పోర్టులకు వెళ్లిన ఈ నౌక ఇప్పుడు మళ్లీ మాల్దీవులు తీరానికి చేరుకుంది. అంతకుముందు ఈ నౌక మాలె తీరానికి వచ్చిన విషయాన్ని మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి ధ్రువీకరించారు. సిబ్బంది రొటేషన్ కోసం చైనా ప్రభుత్వం నుంచి దౌత్యపరమైన అభ్యర్థన వచ్చిన మేరకు దాన్ని అనుమతించినట్లు తెలిపారు.
ఈ నౌక చైనాలోని థర్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందింది. సముద్రగర్భంలోని పరిస్థితులు, ఖనిజాన్వేషణ, ఇతర అంశాలపై పరిశోధనలు జరపడమే దీని ముఖ్య ఉద్దేశమని డ్రాగన్ గతంలో వెల్లడించింది. గతంలో ఇదే తరహా నౌకలు శ్రీలంక తీరంలో కార్యకలాపాలు నిర్వహించాయి. ఇవి జలాల్లో మాత్రమే పరిశోధనలు చేస్తాయని చైనా చెబుతున్నా.. భారత్‌లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు, గగనతలంపై నిఘా ఉంచగలవనే ఆరోపణలున్నాయి. మన పోర్టులు, అణు కేంద్రాలపై కూడా ఓ కన్నేయగలవని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నౌక ఉన్న మాల్దీవుల ప్రాంతం భారత్‌లోని లక్షద్వీప్‌లో గల మినికోయి ద్వీపానికి కేవలం 70 నాటికల్ మైళ్ల దూరంలోనే ఉంది. దీంతో దీని కదలికల్ని భారత నేవీ అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. అయితే తాజా రాకపై భారత నౌకాదళం ఇంకా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Lok Sabha Election: ముగిసిన రెండో విడత పోలింగ్.. ఎంత శాతమంటే..!
ఈ నౌకను లవణీయత, సూక్ష్మజీవుల జన్యు అధ్యయనాలు, నీటి అడుగున ఖనిజాల అన్వేషణ, నీటి అడుగున జీవితం మరియు పర్యావరణ అధ్యయనాల కోసం కూడా ఉపయోగించవచ్చని పేర్కొంది. ఇది సముద్ర ప్రవాహాలు, తరంగాలు మరియు ముఖ్యమైన పర్యావరణ సమాచారాన్ని కొలవగల డేటా బోయ్‌లను కలిగి ఉంది. ఈ బోయ్‌లు చైనా ప్రభుత్వానికి రియల్ టైమ్ శాటిలైట్ సమాచారాన్ని అందజేస్తాయని నివేదిక పేర్కొంది. షియాంగ్ యాంగ్ హాంగ్ 03 నౌక సముద్ర పరిశోధన కోసం దేశంలో తయారు చేయబడిన అత్యంత ఆధునిక నౌక అని పేర్కొంది. ఇది ఒక సమగ్ర పరిశోధనా నౌక అని చైనా చెబుతోంది. అంటే ఇది ఒకటి కంటే ఎక్కువ పనుల కోసం అమర్చబడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Shadnagar: ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు