Site icon NTV Telugu

China: జీ జిన్‌పింగ్‌ దిగిపో.. కొవిడ్‌ ఆంక్షలపై చైనీయుల ఆందోళనలు

China

China

China: డ్రాగన్‌ దేశంలో జీరో కొవిడ్‌ విధానాన్ని కఠినంగా అమలు చేయడంపై మొదలైన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి. దేశంలోని బీజింగ్‌ సహా పలు నగరాల్లో ప్రజలు పెద్దఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. దేశమంతటా దాదాపు 40,000 కొత్త కొవిడ్‌ కేసులు నమోదవడంతో అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు. ఇప్పటికే నెలల తరబడి లాక్‌డౌన్‌లలో మగ్గిపోతున్న ప్రజలు దీనిపై మండిపడుతున్నారు. రాజధాని బీజింగ్‌ తోపాటు షాంఘై తదితర నగరాల్లో, జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన ప్రదర్శనలు ఎక్కువవుతున్నాయి. జీరో కొవిడ్‌ విధానాన్ని ఎత్తివేయాలని స్వదేశంలో, విదేశాల్లో ప్రదర్శకులు డిమాండ్‌ చేయడమే కాదు, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పదవి నుంచి దిగిపోవాలనే డిమాండ్లూ వినవస్తున్నాయి.  బీజింగ్‌లోని గ్జింగ్వా విశ్వవిద్యాలయంలో, నాన్జింగ్‌లోని కమ్యూనికేషన్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఉరుంకి మృతులకు నివాళులు అర్పిస్తున్న ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రచారమయ్యాయి.

ఇదిలా ఉండగా.. గురువారం షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ ముఖ్యపట్టణం ఉరుమ్‌కీలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది దుర్మరణంపాలైన విషయం తెలిసిందే. వారి మరణానికి కొవిడ్‌ ఆంక్షలు, లాక్‌డౌన్‌తోపాటు వారి ఇళ్లకు గొలుసులతో తాళాలు వేయడమే కారణమంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో ప్రభుత్వం ‘జీరో కొవిడ్‌ పాలసీ’ విషయంలో వెనక్కితగ్గుతోంది. ఇప్పటికే ఉరుమ్‌కీలో దశలవారీగా లాక్‌డౌన్లను ఎత్తివేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో చైనావ్యాప్తంగా వృద్ధులు అధికంగా ఉన్న కుటుంబాలు మరోరకమైన ఆందోళనలో మునిగిపోయాయి. ఒకవేళ లాక్‌డౌన్లను ఎత్తివేస్తే.. కొవిడ్‌ కేసులకు అడ్డూ అదుపూ ఉండదని ఆవేదన చెందుతున్నాయి.

ఉరుమ్‌కీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై జనాలు ఏకంగా “కమ్యూనిస్ట్ పార్టీ దిగిపో, జీ జిన్‌పింగ్‌తో దిగిపో” అంటూ నినాదాలు చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న పలు వీడియోలు కనిపిస్తున్నాయి. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో చైనా అంతటా, ముఖ్యంగా జెంగ్‌జౌ, ఉరుమ్‌కి, గ్వాంగ్‌జౌ, షాంఘై, బీజింగ్, టియాంజిన్, జిన్‌జియాంగ్, చాంగ్‌కింగ్ వంటి ప్రధాన నగరాల్లో ఏకకాలంలో భారీ దిగ్బంధన వ్యతిరేక నిరసనలు చెలరేగాయి. కొనసాగుతున్న ఆగ్రహం 1989 అణిచివేత తర్వాత చైనాలో అతిపెద్ద దేశవ్యాప్త సామూహిక నిరసనగా నివేదించబడింది. ఇది మరింత విస్తరించి చివరికి మొత్తం పరిస్థితిని మార్చే అవకాశం ఉంది.

Andhra Pradesh: విశాఖ మహిళ అరుదైన ఘనత.. మిసెస్ ఆసియా టైటిల్ కైవసం

చైనా యొక్క జీరో-కోవిడ్ విధానాన్ని ధిక్కరిస్తూ వందలాది మంది విద్యార్థులు ఆదివారం ఇక్కడ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అల్మా మేటర్, సింఘువా విశ్వవిద్యాలయం వద్ద నిరసన తెలిపారు. వేలాది మంది నిరసనకారులు షాంఘై వీధుల్లోకి వచ్చారు. అక్కడి నుంచి పోలీసులు వారిని బలవంతంగా పంపించివేశారు. విద్యార్థులు బీజింగ్, నాన్జింగ్‌లోని విశ్వవిద్యాలయాలలో కూడా ఆందోళన చేపట్టారు. బీజింగ్‌లోని సింఘువా యూనివర్సిటీకి చెందిన వందలాది మంది విద్యార్థులు ఆదివారం తమ క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించారు. చైనాలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా పారిస్‌, అమ్‌స్టర్డమ్‌, డబ్లిన్‌, టొరెంటో, అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి.

Exit mobile version