China: ప్రపంచ ఆయుధ మార్కెట్‌లో చాలా దేశాలు చైనా ఆయుధాలను పట్టించుకోలేదు. దీంతో చైనా ఆయుధ కంపెనీలు ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నమోదు చేశాయి. గత సంవత్సరం ప్రపంచ ఆయుధ అమ్మకాలలో రికార్డు స్థాయిలో పెరుగుదల ఉన్నప్పటికీ, ఆయుధ పరిశ్రమ టాప్ 100 జాబితాలోని ఎనిమిది చైనా కంపెనీలు తమ మొత్తం ఆదాయంలో గణనీయమైన తగ్గుదలలను చవిచూశాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
READ ALSO: Sanchar Saathi App: ఇకపై అందరి ఫోన్లలో ఈ యాప్..! దీన్ని తొలగించడం కూడా సాధ్యం కాదు!
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ చైనా కంపెనీల మొత్తం ఆదాయం 10% తగ్గి $88.3 బిలియన్లకు చేరుకుంది. చైనా ఆయుధ తయారీదారుల పనితీరు జపాన్, దక్షిణ కొరియా కంపెనీలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. మార్కెట్‌లో జపాన్, దక్షిణ కొరియా ఆయుధ అమ్మకాలలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తుండగా, చైనా కంపెనీలు క్షీణతను ఎదుర్కుంటున్నాయని వెల్లడించాయి. ఈ నివేదికల ప్రకారం చైనాలో అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థ నోరిన్కో ఎక్కువగా నష్టపోయింది. దాని ఆయుధ అమ్మకాలు 2023లో $20.31 బిలియన్ల నుంచి గత సంవత్సరం $13.97 బిలియన్లకు పడిపోయాయి. ఇది దాదాపు 31% తగ్గుదల. కంపెనీ ప్రపంచ ర్యాంకింగ్ కూడా 10వ స్థానం నుంచి 11వ స్థానానికి పడిపోయింది.
నివేదిక ప్రకారం.. నోరిన్కో కంపెనీపై అవినీతి నిరోధక దర్యాప్తు కారణంగా 2024లో కంపెనీ బోర్డు ఛైర్మన్, సైనిక విభాగం అధిపతిని తొలగించారు. ఆ తర్వాత ప్రభుత్వ సమీక్షలు, కాంట్రాక్ట్ జాప్యాల కారణంగా ఈ సంస్థ ఆదాయాలు మార్కెట్‌లో తగ్గాయి. చైనా ఆయుధ సేకరణ వ్యవస్థలో అవినీతి ఆరోపణల కారణంగా 2024లో అనేక ప్రధాన ఒప్పందాలు వాయిదా పడటం, రద్దు అయ్యాయని SIPRI వెల్లడించింది. చైనాలో అతిపెద్ద సైనిక అంతరిక్ష తయారీ సంస్థ అయిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (AVIC) గత సంవత్సరం $20.32 బిలియన్ల అమ్మకాలతో చైనా కంపెనీలకు నాయకత్వం వహించి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అయితే, ఈ సంఖ్య 2023 కంటే 1.3% తక్కువగా ఉంది. టాప్ 100 జాబితాలో ఉన్న రెండు చైనా కంపెనీలు – చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్, ఏరో ఇంజిన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా కంపెనీలు మాత్రమే తమ ఆయుధ అమ్మకాలలో పెరుగుదలను నివేదించాయి. మొదటిది 8.7%, రెండవది 9.6% పెరుగుదలను చూసింది.
మార్కెట్‌లో జపాన్-దక్షిణ కొరియా ఆయుధాలకు డిమాండ్
చైనా కంపెనీలు క్షీణతను ఎదుర్కొంటుండగా, చైనాతో విభేదిస్తున్న దేశమైన జపాన్ వృద్ధిని సాధిస్తోంది. టాప్ 100 జాబితాలో ఉన్న ఐదు జపాన్ కంపెనీల మొత్తం ఆయుధ అమ్మకాలు 40% పెరిగి $13.3 బిలియన్లకు చేరుకున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన నాలుగు ఆయుధ కంపెనీల మొత్తం అమ్మకాలు 31% పెరిగి $14.1 బిలియన్లకు చేరుకున్నాయి. దక్షిణ కొరియాలో అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థ హన్వా గ్రూప్ 2024లో అమ్మకాలు 42% పెరిగాయి, ఆయుధ ఆదాయం $5.6 బిలియన్ల నుంచి $7.97 బిలియన్లకు పెరిగింది. SIPRI జాబితాలో 21వ స్థానంలో ఉన్న ఈ కంపెనీ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద చైనీస్ కాని కంపెనీగా అవతరించింది. 2024లో ప్రపంచ ఆయుధ అమ్మకాలు 5.9% పెరిగి ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి $679 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2015 కంటే 26% పెరుగుదల. యూరప్, యునైటెడ్ స్టేట్స్‌లో ఆయుధ అమ్మకాలలో అతిపెద్ద పెరుగుదలలు కనిపించాయి. ఉక్రెయిన్, గాజాలో యుద్ధాలు, అలాగే ప్రపంచ, ప్రాంతీయ ఉద్రిక్తతలు, క్రమంగా పెరుగుతున్న సైనిక వ్యయం ఆయుధ అమ్మకాలు, కొత్త ఆర్డర్‌లలో పెరుగుదలకు కారణం అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Flipkart Offers 2025: ఇది కదా కావాల్సింది.. Samsung Galaxy S24పై 40 వేల తగ్గింపు!