Monkeys To Space: జీరో గ్రావిటీ వాతావరణంలో కోతులు ఎలా పెరుగుతాయి, పునరుత్పత్తి చేస్తాయో అధ్యయనం చేయడానికి చైనా కొత్తగా ప్రారంభించిన తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి వాటిని పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతరిక్ష రంగంలో తన సత్తా చాటడానికి చైనా యత్నిస్తోంది. ప్రస్తుతం ఆ దిశగా డ్రాగన్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అంతరిక్షంలో తనకంటూ ప్రత్యేకంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. న్యూ తియాంగాంగ్ పేరుతో అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం చైనా ముగ్గురు వ్యోగగాములను స్పేస్‌లోకి పంపించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికల్లా స్పేస్ స్టేషన్‌ను పూర్తిచేయడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. నిర్మాణం పూర్తికాకముందే అందులో ఎలాంటి ప్రయోగాలు చేయాలనే దానిపై డ్రాగన్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటివరకు ఏ దేశం చేయని పనిని చేసేందుకు చైనా సైంటిస్టులు తహతహలాడుతున్నారు. అంతరిక్ష కేంద్రంలోకి కోతులను పంపేందుకు చైనా తన ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం ద్వారా గురుత్వాకరణ శక్తిలేని చోట జీవులు ఎలా స్పందిస్తాయి, వాటిలో ఎలాంటి మార్పులు జరుగుతాయన్న విషయాన్ని తెలుసుకోవచ్చని బీజింగ్‌లోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకుడు జాంగ్‌లూ వెల్లడించారు.
Plane Crash: టాంజానియాలో ఘోర ప్రమాదం.. విక్టోరియా సరస్సులో కూలిన ప్రయాణీకుల విమానం
చేపలు, నత్తలు వంటి చిన్న జీవులను అధ్యయనం చేసిన తర్వాత ఎలుకలు కోతులతో కూడిన కొన్ని అధ్యయనాలు ఇప్పుడు అవి అంతరిక్షంలో ఎలా పెరుగుతాయో, పునరుత్పత్తి చేస్తాయో చూడటానికి నిర్వహించబడతాయని జాంగ్‌లూ పేర్కొన్నారు. ఈ ప్రయోగాలు మైక్రోగ్రావిటీ, ఇతర అంతరిక్ష వాతావరణాలకు జీవి అనుసరణపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓ నివేదిక ప్రకారం, ఎలుకలు, కోతుల వంటి సంక్లిష్ట జీవులపై ఇటువంటి అధ్యయనాలు చేయడంలో ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయని నిపుణులు సూచించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ పరిశోధకులు 18 రోజుల అంతరిక్ష ప్రయాణంలో శారీరక సవాళ్లను అధిగమించడానికి, సంభోగంలో పాల్గొనడానికి కొన్ని ఎలుకలను తీసుకెళ్లారు. కానీ గర్భం దాల్చిన సంకేతాలు లేవు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత కూడా జన్మనివ్వలేదు. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల వృషణాలు, కొన్ని ఇతర పునరుత్పత్తి అవయవాలు దెబ్బతింటాయని, ఇది పరీక్షా జంతువుల సెక్స్ హార్మోన్‌లో గణనీయమైన క్షీణతకు దారితీస్తుందని మునుపటి కొన్ని భూ ప్రయోగాలు సూచించాయని పరిశోధకులు గుర్తించారు.
అయితే పెద్ద జంతువులు, ముఖ్యంగా కోతులు, మానవులతో ఎక్కువ సారూప్యతలను పంచుకున్నందున చంద్రుడు, అంగారక గ్రహం చుట్టూ కక్ష్యలో దీర్ఘకాల స్థిరనివాసం కోసం మరిన్ని దేశాలు ప్రణాళికలు వేస్తున్నందున ఈ ప్రయోగాలు అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చైనా నిర్వహిస్తున్న ఈ ప్రయోగంలో అంతరిక్షంలో గ్రావిటీ లేని చోట కోతులు తమ పునరుత్పత్తి విధానాన్ని ఎలా సాగిస్తాయన్న అంశాలను కూడా పరిశోధనలో పరిగణలోకి తీసుకోనున్నారు. కోతులు పెద్ద జంతువులు కావడం వల్ల శాస్త్రవేత్తలు వాటిని స్పేస్‌లో ఒకేచోట ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. అంతేకాకుండా కోతులకు అవసరమైన ఆహారాన్ని ఎలా అందించాలి.? వాటి వ్యర్థాలను ఎలా తొలగించాలన్న దానిపై పరిశోధకులు దృష్టిసారిస్తున్నారు. అయితే కోతులను ఎన్‌క్లోజర్స్‌లో స్వేచ్చగా ఉంచడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.