China Statement Nepal Crisis: నేపాల్‌లో కొనసాగుతున్న గందరగోళం, తిరుగుబాటుపై చైనా ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌లోని అన్ని పార్టీలు సమిష్టిగా ఉండి.. దేశీయ సమస్యలను పరిష్కరించుకోవాలని, సామాజిక క్రమం, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని చైనా కోరింది. నేపాల్ పరిస్థితిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తొలిసారి మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. “చైనా, నేపాల్ దేశాలు సాంప్రదాయక, స్నేహపూర్వక పొరుగు సంబంధాలను కలిగి ఉన్నాయి. నేపాల్‌లోని అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి దేశీయ సమస్యలను పరిష్కరించుకోవాలి. సామాజిక క్రమాన్ని, ప్రాంతీయ స్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించుకుంటారని మేము ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు. నేపాల్‌లోని చైనా పౌరుల భద్రత గురించి ప్రస్తావించారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు రాలేదని లిన్ అన్నారు. నేపాల్‌లోని తమ పౌరులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. చైనా రాయబార కార్యాలయం అత్యవసర భద్రతా వ్యవస్థను ప్రారంభించిందని, పౌరుల భద్రత దృష్టిసారించాలని చైనా తరఫున కోరారు.
READ MORE: Jaquelin Fernandez : హీరోయిన్ గొప్ప మనసు.. వ్యాధి సోకిన బాబుకు సాయం..
సోషల్ మీడియా నిషేధంపై నేపాల్‌లో ప్రారంభమైన జెన్-జి ఉద్యమం కారణంగా.. ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం సైతం కూలిపోయింది. ఓలి అధికారంలో ఉన్నప్పుడు చైనాకు మంచి దోస్తుగా పేరుంది. చైనాతో నేపాల్ వ్యూహాత్మక సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. కానీ ఓలి రాజీనామాపై లిన్ జియాన్ స్పందించకపోవడం గమనార్హం.
READ MORE: Google Pixel 9 Price: ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్స్.. రూ.80 వేల గూగుల్ పిక్సెల్ ఫోన్ 35 వేలకే!
ఇటీవలే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి కేపీ శర్మ ఓలి చైనాను సందర్శించారు. ఈ పర్యటనలో రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి గుర్తుగా సెప్టెంబర్ 3న జరిగిన చైనా సైనిక కవాతుకు కూడా హాజరయ్యారు. ఓలి చైనా నుంచి తిరిగి వచ్చిన కొద్ది రోజులకే, నేపాల్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఓలి ప్రభుత్వం ఇటీవల 26 సోషల్ మీడియా యాప్‌లను నిషేధించాలనే నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసింది. దీంతో ఉద్యమం ఉదృతంగా మారి ప్రభుత్వం పడిపోయింది.
