China: అంతరిక్ష పరిశోధనలో పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్న చైనా మరో ముందడుగు వేసింది. దేశాల మధ్య అంతరిక్ష పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చంద్రుడిపై శాస్త్రీయ అన్వేషణ కోసం 2030 నాటికి మానవ సహిత మిషన్‌ను పంపాలని డ్రాగన్ భావిస్తోంది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి 2030లో వ్యోమగాములను పంపనున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడేళ్లలో చంద్రుడి మీదకు మానవసహిత ప్రయోగాలు చేపడతామని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ డిప్యూటీ డైరెక్టర్ లిన్ జికియాంగ్ ప్రకటించారు. సన్నాహకాల్లో భాగంగా ముందుగా అంతరిక్ష కేంద్రానికి మూడో విడతగా ముగ్గురు వ్యోమగాములను మంగళవారం పంపుతున్నట్టు ఆయన తెలిపారు.
మంగళవారం ఉదయం 9.31 గంటలకు తన సొంత అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములను చైనా పంపనుంది. వారిలో ఇద్దరు వ్యోమగాములు జింగ్ హైపెంగ్, జూయాంగ్జూ, పౌర వ్యోమగామి గుయ్ హైచావో అయిదు నెలల వరకూ అక్కడ ఉండనున్నారు. వీరిని తీసుకెళ్లనున్న షెంజావో-16 వ్యోమనౌకను ప్రయోగించేందుకు ఇన్నర్ మంగోలియాలోని జ్యూకాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వద్ద ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి వెళ్లినవారంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములే. ఈ అంతరిక్ష నౌక ముగ్గురు వ్యోమగాములను టియాగాంగ్ అనే అంతరిక్ష కేంద్రానికి తీసుకెళుతుందని లిన్ చెప్పారు. చంద్రుడిపై మనుషులతో కూడిన అన్వేషణ కార్యక్రమాన్ని చైనా ఇటీవలే ప్రారంభించింది. 2025 నాటికి తమ వ్యోమగాములను పంపుతామని నాసా, చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా తమ మిషన్‌ను మొదలు పెట్టింది.
Read Also: Gehlot vs Pilot: అశోక్, సచిన్‌ల మధ్య కుదిరిన రాజీ ఫార్ములా.. అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు
భూమి నుంచి చంద్రుడి మీదకు వెళ్లిరావడం, స్వల్పకాలం చంద్రుడిపై ల్యాండింగ్, మానవసహిత రోబో పరిశోధనలు, ల్యాండింగ్, కలియతిరగడం, శాంపిళ్ల సేకరణ, పరిశోధన, తిరుగుప్రయాణం ఇలా పలు కీలక విభాగాల్లో పట్టుసాధించేందుకు కృషిచేస్తున్నట్లు లిన్ జికియాంగ్ చెప్పారు