తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలలో మిరప కూడా ఒకటి.. దీన్ని వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. మిరపను సుమారుగా 6.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.. వాతావరణ పరిస్థితులను బట్టి మిరప దిగుబడి కూడా తగ్గుతుంది.. ఇక తెగుళ్లు కూడా ఎక్కువే.. ఒక్కసారి వస్తే ఇక మందులు వాడుతూనే ఉండాలి.. మిరప పంటను ముఖ్యంగా రసంపీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. కావున తగిన చర్యలు తీసుకోని సరైన యాజమాన్య పద్ధతులు పాటించిన యెడల మిరపలో చీడపీడలను నివారించి అధిక దిగుబడులను పొందవచ్చును. ఈరోజు మనం మిరపలో వచ్చే తెగుళ్లు, నివారణ చర్యలను తెలుసుకుందాం..
వేరు పురుగు.. మిరప మొక్క వేర్లను, కాండాన్ని తిని నష్టపరుస్తాయి. తిన్న మొక్కలు వడలి, ఎండిపోతాయి. తల్లి పెంకు పురుగు తొలకరి వర్షాల తరువాత భూమిలో గ్రుడ్లు పెడుతుంది. 10-12 రోజుల్లో గ్రుడ్లు పొదిగి తెల్లని పిల్ల పురుగులు భూమిలో తిరుగుతూ మొక్కని నష్టపరుస్తాయి. దీని నివారణకు ఎకరాకు 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి, 10-12 కిలోల 3% కార్బోఫ్యూరాన్ గుళికలు ఆఖరి దుక్కిలో వేసి భూమిలో కలియదున్నాలి. మరియు క్లోరిపైరిఫాస్ 50 ఇసి 1.5 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 0.7 మి.లీ. + ఫిప్రోనిల్ 1 గ్రా. లీటరు కలిపి పిచికారి చెయ్యాలి..
పేనుబంక పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ఎండి మొక్కల పెరుగుదల తగ్గుతుంది. ఈ పురుగులు విసర్జించే తియ్యని పదార్థం వల్ల చీమలు చేరతాయి. ఆకు, కాండం, కాయలపై మసి తెగులు వ్యాపిస్తుంది. ఈ పురుగులు ఆశించిన ఆకులు మెలికలు తిరిగి మొక్క ఎదుగుదల తగ్గి, దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 0.7 మి.లీ. లేదా థయోమిథాక్సామ్ 25% డబ్ల్యూజి 0.5 గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.. అప్పటికి పోకుంటే వేపనూనెను పిచికారి చెయ్యాలి..
ఇకపోతే అన్నిటికన్నా ఎక్కువగా సోకేది తామర పురుగులు.. ఇవి చాలా చిన్నవిగా, సున్నితంగా ఊదారంగులో, చీలిన రెక్కలతో ఉంటాయి. తల్లి, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు మెలి తిరిగి, అంచుల వెంబడి పైకి ముడుచుకుపోతాయి. అందువల్ల దీనిని పై ముడత అంటారు. ఈ ముడత వల్ల మిరప మొక్కల్లో ఆకులు చిన్నవై ఇటుక రంగులో కనిపిస్తాయి.. పురుగు ఉధృతిని బట్టి ఎసిటామిప్రిడ్ 20% ఎస్.పి 0.2గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 0.7 మి.లీ. లేదా డైఫెన్ థైయూరాన్ 1.5గ్రా. లేదా స్పైనోశాడ్ 0.25 మి.లీ. లీటరు నీటిలో కలిపి మొక్కలు తడిచేలా పిచికారి చెయ్యాలి.. ఇకపోతే తెల్లనల్లి కూడా మిరప దిగుబడిని దెబ్బతీస్తాయి.. ఏదైనా తెగులు సోకినా వెంటనే వాటిని గుర్తించి తగిన ముందులు వాడటం మంచిదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు..