NTV Telugu Site icon

Chilipi Krishnudu: నలభై ఐదేళ్ళ’చిలిపి కృష్ణుడు’

Chilipi Krishnudu

Chilipi Krishnudu

సురేశ్ ప్రొడక్షన్స్‌కు, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. యన్టీఆర్ ‘రాముడు-భీముడు’తో మొదలైన సురేశ్ సంస్థ ఏయన్నార్ తో తొలిసారి ‘సిసాయి చిన్నయ్య’ నిర్మించింది. ఆ పై సురేశ్ అధినేత డి.రామానాయుడు కొన్ని పరాజయాలు చవిచూశారు. ఆ సమయంలో రామానాయుడు చిత్రసీమలో ఉండడమో, ఊరికి వెళ్ళడమో అనుకున్నప్పుడు ఏయన్నార్ తో నిర్మించిన రంగుల చిత్రం ‘ప్రేమనగర్’ ఘనవిజయం సాధించింది. అప్పటి నుంచీ ఏయన్నార్, శోభన్ బాబుతో చిత్రాలు నిర్మిస్తూ సాగారు రామానాయుడు. ఏయన్నార్ హృదయ శస్త్ర చికిత్స తరువాత నటించిందీ సురేశ్ సంస్థ నిర్మించిన ‘సెక్రటరీ’లోనే! ఆ తరువాత ఏయన్నార్ తో సురేశ్ సంస్థ తెరకెక్కించిన ‘చిలిపికృష్ణుడు’ సైతం జనాన్ని భలేగా అలరించింది. 1978 జనవరి 11న ‘చిలిపి కృష్ణుడు’ విడుదలయింది.

‘చిలిపి కృష్ణుడు’ కథ ఏమిటంటే- డాక్టర్ కృష్ణ, డాక్టర్ వాణి మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే ప్రేమించుకుంటారు. పెళ్ళాడాలనీ ఆశిస్తారు. అయితే కొంతమంది దుర్మార్గులు వాణిని రేప్ చేస్తారు. చనిపోతూ, తన కుటుంబ పరిస్థితులు చెబుతుంది. అలాగే తన ఊరిలోని పేదవారికి ఉచిత వైద్య అందించాలన్నదీ తన కల అంటుంది. వాటిని నెరవేర్చడానికి కృష్ణ, వాణి ఊరెళతాడు. అక్కడ అచ్చు వాణి పోలికలతో ఉన్న ఆమె చెల్లెలు రాణి కనిపిస్తుంది. ఆమెను తీర్చిదిద్దుతాడు. అలాగే ఊరిలో ఆసుపత్రి నెలకొల్పి పేదవారికి కృష్ణ వైద్యసేవలు అందిస్తూ ఉంటాడు. దాంతో ఆ ఊరిలో నాగలింగం అనే నాటు వైద్యుడు, కృష్ణకు పలు విధాలా అడ్డు తగలుతాడు. కానీ, జనం కృష్ణ వైద్యం కోసమే పరుగు తీస్తూ ఉంటారు. వాణి జీవితం నాశనం కావడానికి కారణమైన రాజా ప్రమాదానికి గురై ఆ ఊరికి వస్తాడు. అతని భార్య కూడా చేరుకుంటుంది. నాగలింగం వైద్యంతో రాజా ప్రాణానికే ముప్పు వస్తుంది. రాజాను ఆయన భార్య కృష్ణ దగ్గరకు తీసుకు వస్తుంది. కృష్ణకు, రాజా ఎవరో తెలుసు. కానీ, వృత్తిధర్మంగా అతనికి వైద్యం చేస్తాడు. అప్పుడే రాజా తప్పిపోయిన తన అన్న విషయం కృష్ణకు తెలుస్తుంది. రాజా కూడా పశ్చాత్తాపంతో తన తప్పు క్షమించమంటాడు. రాణి తల్లి పెద్దకూతురు వాణిని చూడాలంటుంది. దాంతో రాణినే వాణిగా నటింప చేస్తాడు కృష్ణ. అదే సమయంలో రాజాను, అతని భార్యను పోలీసుల బారి నుండి కృష్ణ దాచిపెట్టి రక్షిస్తూ ఉంటాడు. నాగలింగం ఈ విషయాలు తెలుసుకొని అల్లరి చేస్తాడు. కానీ, తన అన్న కుటుంబాన్ని కాపాడడానికి కృష్ణ మౌనం వహిస్తాడు. వాణి మరణించిందన్న విషయం తెలుస్తుంది. అందరూ కృష్ణ వల్లే ఆమె చనిపోయిందని నమ్ముతారు. కానీ, రాణి అసలు నేరస్థుడైన రాజాను బయటకు తెస్తుంది. కృష్ణ మంచితనాన్ని, ఆయన తండ్రి కూడా వచ్చి అందరికీ చెబుతాడు. చివరకు రాజా పోలీసులకు లొంగిపోతాడు. అతని భార్య లక్ష్మి బాధ్యతను తన కుటుంబానికి అప్ప చెబుతాడు రాజా. చివరకు కృష్ణ, రాణి ఒక్కటవ్వడంతో కథ ముగుస్తుంది.

ఏయన్నార్ సరసన వాణిశ్రీ నాయికగా నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాలరావు, రాజబాబు, అల్లు రామలింగయ్య, కె.వి.చలం, కె.కె.శర్మ, సిహెచ్.కృష్ణమూర్తి, చిట్టిబాబు, శాంతకుమారి, సూర్యకాంతం, రమాప్రభ, రాధాకుమారి, ఫటాఫట్ జయలక్ష్మి, శుభ ముఖ్యపాత్రధారులు. వి.సి.గుహనాథన్ కథ అందించిన ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ మాటలు రాశారు. కేవీ మహదేవన్ బాణీలు కూర్చిన ఈ చిత్రానికి ఆత్రేయ, వేటూరి సాహిత్యం సమకూర్చారు. “చీరలెత్తు కెళ్ళాడా చిన్నికృష్ణుడు…”, “గోవిందా గోవిందా…”, “ఎళ్ళొస్తానోయ్ మామా మళ్ళొస్తానోయ్…”, “కాటుకెట్టి బొట్టు పెట్టి…”, “నేర్చుకో నేర్పుతానూ నేర్చుకో…”, “ఇందుకేనా విధి ముందుగ నీకు తెలిసేనా…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి.

‘చిలిపికృష్ణుడు’ చిత్రం 1978 సంక్రాంతి విజేతగా నిలచింది. రజతోత్సవం చూసిందీ సినిమా. ‘చిలిపికృష్ణుడు’కు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. అంతకు ముందు రామానాయుడు నిర్మించిన ‘సావాసగాళ్ళు’తోనే బోయిన సుబ్బారావు దర్శకునిగా పరిచయం అయ్యారు. తరువాత ఈ సినిమాను హిందీలో రామానాయుడు ‘బందిష్’ పేరుతో రాజేశ్ ఖన్నా, హేమామాలిని జంటగా తెరకెక్కించారు. ‘బందిష్’ చిత్రానికి కె.బాపయ్య దర్శకత్వం వహించారు.