NTV Telugu Site icon

CM Chandrababu: మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandrababu

Chandrababu

CM Chandrababu: మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీపీసీఆర్ కిట్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ కిట్‌ను తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్ టెక్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెడ్ టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్‌డెక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్‌ (ErbaMDx MonkeyPox RT-PCR Kit) పేరిట ఈ కిట్ రూపకల్పన చేసినట్లు సీఈఓ జితేంద్ర శర్మ సీఎంకు వివరించారు.

Read Also: Kadambari Jethwani Issue: ముంబై నటి వ్యవహారంపై విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతి నియామకం

ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించిందని తెలిపారు. మంకీపాక్స్ నిర్ధారణకు దేశీయంగా మొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను రూపొందించిన మెడ్ టెక్ జోన్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు అభినందించారు. మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం నుంచి మెడ్ టెక్ జోన్‌కు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. వినియోగదారులకు ఆర్థిక భారం లేకుండా త్వరలో సోలార్‌తో నడిచే ఎలక్ట్రానికి వీల్ చైర్‌ను రూపొందించనున్నట్లు మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్కువ ఖర్చుతో మన్నిక గల వైద్య పరికరాలను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.