Site icon NTV Telugu

Cherlapally Drug Case: దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉందా?.. చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారా?

Cherlapally Drug Case

Cherlapally Drug Case

చర్లపల్లి డ్రగ్ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్, విజయ్‌కి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉందా?. అమెరికా కంపెనీ కోసం ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ తయారు చేస్తున్నాడనే వాదనలో నిజమెంత?, ముంబై కోర్టులో పోలీసులు ఏం వాదించారు?.

చర్లపల్లిలో మెఫిడ్రిన్‌ డ్రగ్స్‌ వ్యవహారం.. ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయింది. ఈ కేసులో వాగ్దేవి ఫార్మా యజమాని వోలేటి శ్రీనివాస్‌తో పాటు వోలేటి విజయ్, మరో వ్యక్తి తానాజీని పోలీసులు ముంబైకి తరలించారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. అంతే కాదు.. 15 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ముంబై పోలీసులు కోర్టును అభ్యర్థించారు.

మరోవైపు ఈ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్.. తాను నిర్దోషినని చెప్పే ప్రయత్నం చేశాడు. చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో కేవలం రీసెర్చ్ చేస్తానన్నాడు. అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీ కోసం తాను పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ కంపెనీకి కావాల్సిన డ్రగ్స్ కోసమే రీసర్చ్ చేస్తున్నట్లు తెలిపాడు. అంతే కానీ డ్రగ్స్ తయారు చేయడం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. డ్రగ్స్ తయారీకి కావాల్సిన ముడి సరుకు నా దగ్గర లేదని చెప్పాడు.

చర్లపల్లి వాగ్దేవి ఫార్మా కంపెనీ యజమాని శ్రీనివాస్ వోలేటిని మీరా భయందర్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. డ్రగ్స్ తయారు చేస్తున్న తానాజీ తోపాటు విజయ్‌ని కోర్టులో హాజరుపరచగా 15 రోజులపాటు రిమాండ్‌కు తరలించారు. వీళ్లతోపాటు దాదాపు 50 వేల లీటర్ల కెమికల్స్, 950 కిలోల డ్రగ్ పౌడర్‌ను కూడా కోర్టు ముందు ఉంచారు. ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నారని.. ఈ కేసులో నిందితులకు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందని పోలీసుల తరఫు న్యాయవాదులు వాదించారు. ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్నారని తెలిపారు.

మరోవైపు ఈ కేసులో ముంబై పోలీసులు మొదటి నుంచి చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఫాతిమా అనే మహిళ ద్వారా హైదరాబాద్‌లో డ్రగ్స్ తయారీ గురించి వారికి పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడి నుంచి ఫాతిమాను హైదరాబాద్ పంపించారు. ఆమె ఓ సాధారణ పర్యాటకురాలిగా హైదరాబాద్‌ వచ్చి.. 200 గ్రాముల మెఫిడ్రిన్‌ను ముంబై తీసుకెళ్లింది. తర్వాత ముంబై పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి చర్లపల్లిలో డ్రగ్ రాకెట్ భరతం పట్టారు. ఈ కేసుతో ఈగల్‌, రాచకొండ పోలీసులు, ఎక్సైజ్ విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని ఇందులో చాలా పెద్ద మనుషులు ఉన్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్తున్నారు.

Exit mobile version