NTV Telugu Site icon

Char Dham Yatra: నిలిచిపోయిన చార్‌ధామ్ యాత్ర.. అధికారులకు సీఎం ఆదేశాలు

Chardham Yatra

Chardham Yatra

Char Dham Yatra: కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం కారణంగా చార్ ధామ్ యాత్రను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చార్ ధామ్ యాత్రలో వర్షం, మంచు కురుస్తున్న దృష్ట్యా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.”మార్గమధ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం చార్ ధామ్ యాత్రను నిలిపివేసింది. హిమపాతం, వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల వివిధ ప్రదేశాలలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చార్ ధామ్ యాత్రకు వచ్చే ప్రయాణికులు వాతావరణం అనుకూలించిన తర్వాత తమ యాత్రను కొనసాగించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.” అని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.

Also Read: Delhi Metro: 15 గంటల్లో 286 స్టేషన్లు కవర్ చేసిన ఓ వ్యక్తి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..!

ఇదిలావుండగా, రానున్న 24 గంటల్లో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, టెహ్రీ గర్వాల్ జిల్లాల్లోని పలు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సోమవారం అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని కొన్ని జిల్లాల్లో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ రాష్ట్రంలో వర్షాల పరిస్థితికి సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి, వర్షాల పరిస్థితి, నీటి ఎద్దడి, వర్షాల కారణంగా సంభవించిన నష్టాల గురించి సీఎం ధామి డిజాస్టర్ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం తెలుసుకున్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం గత 24 గంటల్లో హరిద్వార్‌లో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర పరిధిలోని జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయని, ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. విపత్తు సహాయం, రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.