Site icon NTV Telugu

Chandrayaan 3: ల్యాండర్, రోవర్ నుండి అందని సిగ్నల్.. ఇస్రో తాజా అప్‌డేట్

Chadrayan 3

Chadrayan 3

Chandrayaan 3: చంద్రయాన్ 3పై ఇస్రో ఓ అప్ డేట్ ఇచ్చింది. మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను స్లీప్ మోడ్ నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ల్యాండర్, రోవర్ నుండి సిగ్నల్ అందలేదని తెలిపింది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో వున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను మేల్కోలిపే ప్రణాళికలను ఇస్రో రేపటికి వాయిదా వేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. తద్వారా మేల్కొనే స్థితిని నిర్ధారించవచ్చని ఇస్రో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతానికి వాటి నుంచి ఎలాంటి సిగ్నల్ రాలేదని పేర్కొంది.

Read Also: Kamal Haasan: ‘ఉదయనిధి చిన్నపిల్లవాడు’.. సనాతన వ్యాఖ్యలపై స్పందించిన కమల్ హాసన్

శుక్రవారం సాయంత్రంలోగా ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లను మళ్లీ యాక్టివేట్ చేయాలనేది తమ ప్లాన్, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు. దీంతో మళ్లీ రేపు ప్రయత్నిస్తామని చెప్పారు. ల్యాండర్ మరియు రోవర్ 16 రోజుల పాటు స్లీప్ మోడ్‌లో ఉన్నాయని.. శుక్రవారం రెండూ యాక్టివేట్ అవుతాయని ఇస్రో అంతకుముందు తెలిపిన విషయం తెలిసిందే. చంద్రుడిపై సూర్యాస్తమయం అయిన తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. దక్షిణ ధృవం వద్ద మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను రోవర్, ల్యాండర్ తట్టుకుంటాయా.. మళ్లీ తిరిగి పనిచేస్తాయా అని ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈ రెండింటిని అనుకున్న ప్రకారం నిద్రలేపితే మాత్రం భారత్ మరో చరిత్ర సృష్టించినట్లే.

Read Also: Regina Movie in OTT : సైలెంటుగా ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా థ్రిల్లర్‌ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

కాగా.. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

Exit mobile version