టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ప్రజల్లోకి వెళ్ళనున్నారు. ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి విస్తృత పర్యటనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభకు పెట్టిన పేరుతోనే ప్రజల్లోకి టీడీపీ అధినేత వెళ్లనున్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలంటే ప్రజా గళం పేరే సరైందని చంద్రబాబు భావించారు. ఒకట్రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, పెండింగులో ఉన్న 16 అసెంబ్లీ స్థానాల పైనా ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇక, ఎంపీ అభ్యర్థులతో పాటు మిగిలిన అసెంబ్లీ అభ్యర్థుల పేర్ల ప్రకటన తర్వాత ప్రజల్లోకి చంద్రబాబు వెళ్లనున్నారు. చంద్రబాబు చేపట్టే ప్రజా గళం రోడ్ మ్యాప్ ను టీడీపీ సిద్దం చేస్తోంది.
Read Also: Ananya Nagalla :కాలినడకన తిరుమలకు వెళ్లిన హీరోయిన్.. వీడియో వైరల్..
ఇక, ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే మూడు పార్టీలు జట్టు కట్టాయని చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. మా జెండాలు వేరే కావొచ్చు.. మా అజెండా మాత్రం ఒక్కటే అని ఆయన చెప్పుకొచ్చారు. మోడీ ఒక వ్యక్తి కాదు.. భారతదేశాన్ని విశ్వగురుగా మారుస్తున్న ఒక శక్తి అని చెప్పారు. మోడీ అంటే దేశ ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం.. ప్రపంచం మెచ్చిన మేటి నాయకుడు అని టీడీపీ అధినేత తెలిపారు. ప్రధాన మంత్రి అన్నయోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలతో సంక్షేమానికి మోడీ కొత్త నిర్వచనం ఇచ్చారు అంటూ చంద్రబాబు అన్నారు.
