Site icon NTV Telugu

Chandrababu: ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu

Chandrababu

Chandrababu: అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని నిన్ననే(బుధవారం) చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలను గుంటూరు, విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు ఆయన భద్రతా సిబ్బంది తెలిపారు. ఇవాళ చంద్రబాబు ఢిల్లీ బయలు దేరే ముందు చుట్టు పక్కల ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లీ ఆపారు. పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సేవకులుగా పోలీసులు మారాలంటూ చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. రేపు జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం ఎంపీలకి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.

Read Also: AP CEO MK Meena: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నిలుపుదల

ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం సుమారు గంటన్నరపాటు సాగిన టీడీపీపీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలిచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని.. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని ఎంపీలకు సూచించారు. స్టేట్ ఫస్ట్ నినాదంతోనే పార్లమెంట్ వేదికగా కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి, ఆ తర్వాతే మనం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవస్థలకు ఆతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది అని గుర్తించాలన్నారు. పదవులు శాశ్వతం అని ఎవ్వరూ అనుకోవద్దన్నారు. మన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించాం, ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారన్నారు.

Exit mobile version