MP Kesineni Nani: బెజవాడ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. తన సోదరుడు కేశినేని చిన్నికి, ఎంపీ కేశినేని నానికి ఏ విషయంలో పొసగకుండా అయిపోయింది.. ఆస్తుల గొడవగా తెరపైకి వచ్చిన వివాదం.. అది రాజకీయ విమర్శలకు దారితీసింది.. ఇద్దరికీ సర్దిచెప్పలేక టీడీపీ అధినాయకత్వం మౌనంగా ఉన్నాయనే విమర్శలు లేకపోలేదు.. అయితే, కొద్ది నెలలుగా నెలకొన్న ఈ సందిగ్ధతకు చంద్రబాబు నాయుడు ముగింపు పలికేశారు.. విజయవాడ పార్లమెంటు బాధ్యతల నుంచి కేశినేని నానిని తప్పించాలనే నిర్ణయానికి వచ్చారు. తాజాగా, తిరువూరులో ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ రచ్చగా మారింది.. దీంతో, చర్యలకు పూనుకుంది టీడీపీ.. ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసింది.. బెజవాడ ఎంపీ టిక్కెట్టను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. మొత్తంగా తిరువూరు ఘటన తర్వాత క్లారిటీ ఇచ్చేసింది టీడీపీ అధిష్టానం.
Read Also: Jasprit Bumrah: నా హృదయంలో ఈ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది!
ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన పోస్టును గమనిస్తే.. అందరికీ నమస్కారం ”నిన్న సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నన్ను కలిసి 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంఛార్జీగా చంద్రబాబు నియమించారు.. కాబట్టి ఆ విషయంలో కన్ను కలగచేసుకోవద్దని చంద్రబాబు నాకు చెప్పమన్నారని తెలియజేశారు. అట్లాగే రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని నేను హామీ ఇచ్చాను.” అంటూ రాసుకొచ్చారు ఎంపీ కేశినేని నాని.
Read Also: Prashanth Varma: పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి ఏం చెప్పావ్ అన్నా.. నెక్స్ట్ లెవెల్ అంతే
ఇక, విజయవాడ ఎంపీ స్థానంపై సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వడంతో.. కేశినేని చిన్నికి లైన్ క్లియర్ అయినట్టు అయ్యింది.. విజయవాడ లోక్ సభకు సంబంధించిన పార్టీ బాధ్యునిగా కేశినేని చిన్నిని త్వరలో టీడీపీ ప్రకటిస్తుందని చెబుతున్నారు. అయితే, తిరువూరులో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వెళ్లిన సమయంలో.. ఫ్లెక్సీలలో ఫోటోల విషయంలో ఘర్షణ తలెత్తింది. ఎంపీ కేశినేని నానిని అవమానించారంటూ వివాదం జరగడంతో పార్టీ కార్యాలయంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన టీడీపీ అధిష్టానం చివరకు ఎంపీ కేశినేని నానిదే తప్పని తేల్చినట్టు తెలుస్తుంది.. అందుకే.. ఇక, ఎక్కువ కాలం వేచిచూసే ధోరణి లేకుండా.. పార్టీ దూతలను రంగంలోకి దించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి.. ఈ వివాదానికి తెరదింపింది. అయితే, ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం.. ఎటు దారి తీస్తుంది? అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని హామీ ఇచ్చినా.. ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? అనేది ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో హీట్ పెంచుతుంది.
