Site icon NTV Telugu

Chandrababu: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ..

Chandrababu

Chandrababu

Chandrababu: తప్పు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడిని చిత్తూరు ఎమ్మెల్యేగా పెట్టారని.. రాష్ట్రాన్ని స్మగ్లింగ్‌కు అడ్డాగా మార్చారని విమర్శలు గుప్పించారు. మన బ్రాండ్‌ కియా, సెల్‌కాన్ కంపెనీలను తీసుకుని రావడం అయితే.. జగన్ భూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్ మద్యం బ్రాండ్‌లు తెచ్చారని ఎద్దేవా చేశారు. జగన్‌ గోలీలు ఆడేటప్పుడే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానన్నారు. నాణ్యత లేని మద్యం అమ్మడం, కరెంటు చార్జీలు పెంచడం జగన్ మార్క్ పరిపాలనా అంటూ విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు పెట్టానని.. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ వేయలేని పాలన జగన్‌ది అంటూ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Read Also: Andhra Pradesh: వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు

ఇసుకలో తైలం తీసే ఘనత వైసీపీ నేతలకు దక్కిందన్నారు. రాష్ట్రానికి ఒక డ్రైవర్‌లా పనిచేస్తానని.. స్టీరింగ్ తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. తన డ్రైవింగ్‌లో యాక్సిడెంట్స్ జరగవని.. అందరికి మంచే జరుగుతుందన్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో తిరుపతి, విశాఖ సహా చాలా చోట్లా వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. జగన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని విమర్శించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో పాపాత్ముడు బియ్యపు మధుసుధన్ రెడ్డి అంటూ తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. శ్రీకాళహస్తి ఆలయాన్ని దోపిడీకి వాడుకున్నారని ఆరోపించారు. దొంగపట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న బియ్యపు మధుసూధన్ రెడ్డిని జైలుకి పంపిస్తానన్నారు. శ్రీకాళహస్తిని డ్రగ్స్, గంజాయికి అడ్డాగా మార్చాడన్నారు.

టీడీపీ హయాంలో కోతలు లేని కరెంట్ ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ఐదేళ్లుగా గాడితప్పిన పాలనను తాము వచ్చాక సరిచేస్తామన్నారు. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చంద్రబాబు వెల్లడించారు. అభివృద్ధి అంటే పేదవాడి ఆదాయం పెరగాలన్నారు.

 

Exit mobile version