NTV Telugu Site icon

Chandrababu: నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

Chandrababu

Chandrababu

Chandrababu: నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని సభాప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం-ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జితన్ రామ్ మాంఝీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖా మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర రోడ్ల రవాణా-ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ.రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేష్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలెప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖా మంత్రి అనుప్రియా పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయశాఖా మంత్రి రామ్‌దాస్ అథవాలే,రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేశారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీని ఏర్పాటు చేశారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశారు.

Read Also: AP Cabinet: ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.

ఈ కార్యక్రమానికి వీవీఐపీలు వస్తుండడంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. ప్రాంగణం పక్కనే ఉన్న నేషనల్ హైవేపై ట్రాఫిక్‌జామ్‌ కాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి పాస్‌లు ఉన్నవారినే చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేపైకి అనుమతిస్తారు. పాస్‌లు లేనివారిని రోడ్లపైకి అనుమతించబోమని విజయవాడ పోలీసులు తెలిపారు. సభకు వచ్చేవారు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని, వాహనాల్లో ఉంచి ప్రాంగణంలోకి రావాలని కోరారు. బుధవారం ఉదయం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శించుకోనున్నారు. అనంతరం తిరిగి అమరావతికి రానున్నారు.

చంద్రబాబు  24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నారు.  మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది. ఓసీలకు 12 మంత్రి పదవులు కేటాయించగా.. బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి 8 మంత్రి పదవులను కేటాయించారు. ఎస్సీలకు 2 మంత్రిపదవులు కేటాయించగా.. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఒకరికి చోటు లభించింది. అలాగే మైనార్టీలకు కూడా ఒక మంత్రిపదవిని కేటాయించారు. సగానికి పైగా కొత్తవారికి అవకాశం లభించింది. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది.