Manifesto will be released soon Says Chandrababu: సంక్షేమ పథకాలకు నాంది పలికింది టీడీపీ అని, సీఎం జగన్ పాలనలో వంద పథకాలను రద్దు చేశారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరిట సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక యువతకు ఉద్యోగాలు, మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు.
‘దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తామనుకునే వైసీపీ నేతల ఆటలు ఇక సాగవు. సంక్షేమ పథకాలకు నాంది పలికింది టీడీపీ. సీఎం జగన్ పాలనలో వంద పథకాలను రద్దు చేశారు. ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరిట సూపర్ సిక్స్ అందిస్తాం. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగులకు రూ. 3వేల భృతి అందిస్తాం. మహాలక్ష్మి పథకం ద్వారా నెలకి రూ. 1500 ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచితం, ఏడాదికి 3 సిలండర్లు ఇస్తాం. అన్నదాత కింద రైతులకు రూ.20 వేలు అందజేస్తాం. జయహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తాం. టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం’ అని చంద్రబాబు తెలిపారు.
Also Read: Chandrababu Naidu: టమోటోకి, పొటాటోకి తేడా తెలియని సీఎం జగన్: చంద్రబాబు
‘దేశంలో నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. టీడీపీ ఉద్యోగాలు తెస్తే.. జగన్ గంజాయి తెచ్చాడు. టీడీపీ-జనసేన క్యాడర్ ప్రజలను చైతన్యం చేయాలి. రౌడీయిజం చేసి, డబ్బులు ఖర్చు పెట్టీ మరోసారి గెలుస్తా అని జగన్ అనుకుంటున్నాడు. అవన్నీ కుదరవు. తెలంగాణ వెళ్లి మద్యం తాగి వస్తున్న పరిస్థితి నెలకొంది. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ ఏపీలో పెట్టారు. సీఎం రంగుల పిచ్చోడు. ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన పేరు పెట్టుకుంటాడు. పొలంలో సర్వే రాళ్లపై కూడా జగన్ ఫోటో ఉంటుంది. తాతలు ఇచ్చిన ఆస్తులపై, పాస్ పుస్తకాలపై కూడా జగన్ ఫోటోనా. జగన్ ఏమన్నా వారి తండ్రి, తల్లి తరపు బంధువా? ఫొటో వేయటానికి. చివరకు మరుగు దొడ్ల మీద కూడా జగన్ ఫోటో ఉంది. ఈ ఫోటో రానున్న రోజుల్లో మరుగ దొడ్ల లోపల కూడా వేస్తారు?’ అని చంద్రబాబు విమర్శించారు.