NTV Telugu Site icon

TDP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ

Chandrababu

Chandrababu

TDP Parliamentary Meeting: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తిన అంశాలపై చర్చ చేపట్టారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని చంద్రబాబు సూచనలు చేశారు. ఏపీ అభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీ పడి పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై సీఎం సూచనలు చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Read Also: Srisailam Project: శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు.. భారీగా పెరిగిన వరద ప్రవాహం

ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశంపై భేటీలో ప్రస్తావించారు. జగన్ గురించి, వైసీపీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు పేర్కొన్నట్లు సమాచారం. జగన్ గురించి ఒక్క క్షణం ఆలోచించే సమయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి సూచించారు. ఢిల్లీలో జగనేం చేస్తాడో ముఖ్యం కాదని.. మనమేం చేయాలనేదే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఎంపీలతో చర్చించినట్లు తెలిసింది.