Raptadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలోనే రంపంతో బాలికపై దాడికి తెగబడటం అత్యంత ఘోరమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించిన సీఎం, ఆమెకు అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని సూచించారు. దాడికి పాల్పడిన నిందితుడిని తక్షణమే పట్టుకుని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశిస్తూ, చిన్నారుల భద్రత విషయంలో ఇలాంటి ఘటనలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
అలాగే, ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. క్లాస్ రూమ్‌లోనే నెత్తుటి మడుగులో ఉన్న చిన్నారిని చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, కన్నీళ్లు ఆగడం లేదన్నారు. ఈ ఉన్మాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఆడపిల్లలు, మహిళల జోలికి రావాలంటేనే భయపడేలా కఠిన చర్యలు ఉంటాయని, పిల్లల భద్రతలో నిర్లక్ష్యం వహించే వారిని, బాధ్యులైన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు హోం మంత్రి అనిత అనంతపురం జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సైతం స్పందిస్తూ, బాలికకు అత్యవసర, నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

