NTV Telugu Site icon

AP Cabinet: చంద్రబాబు కేబినెట్‌లో శాఖల కేటాయింపు?.. పవన్‌కు కీలక శాఖలు !

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు. పవన్ కల్యాణ్‌ను ఉపముఖ్యమంత్రిని చేయడంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్టు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేశ్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు తెలిసింది. పవన్ కోరిక మేరకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించారని తెలుస్తోంది. లోకేశ్‌కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

శాఖల కేటాయింపుపై ఇవాళ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి జనసేనకు ఏయే శాఖలు లభిస్తాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు జనసేనకు పరిశ్రమలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్ వంటి కీలక శాఖలను కట్టబెడతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఆర్థికం, రెవెన్యూ వంటి అంశాలను పయ్యావుల, ఆనం వంటి వారికి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫరూక్‌కు మైనార్టీ శాఖ, గుమ్మడి సంధ్యారాణికి గిరిజన సంక్షేమం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తయ్యాక శాఖల కేటాయింపుపై జీవోలను విడుదల చేయనున్నారు. ఇవాళ సాయంత్రానికి శాఖల కేటాయింపుపై జీవోలు జారీ చేసే అవకాశం ఉంది.

Read Also: Chandrababu: తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు

బుధవారం ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు తొలిసారి మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులతో బుధవారం సాయంత్రం సుమారు 20 నిమిషాల సేపు సమావేశం నిర్వహించారు.. మంత్రులతో జరిగిన భేటీలో కొన్ని కీలకాంశాలను ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు.. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.. తాను తొలిసారి సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి.. ఇప్పటి పరిస్థితులపై విశ్లేషించారు చంద్రబాబు. మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని సూచించారు.. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..ఇక, శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదాం అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని కొత్త మంత్రులకు కీలక సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..