NTV Telugu Site icon

Chandrababu: గవర్నర్‌కు చంద్రబాబు లేఖ.. ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు..!

Chandrababu

Chandrababu

Chandrababu: ఏపీ గవర్నర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపేయాలని గవర్నర్‌ను లేఖ ద్వారా కోరారు చంద్రబాబు.. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. పారదర్శకత పాటించని ఈ ప్రభుత్వంలో ఈ-ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇక, చంద్రబాబు తన లేఖలో పేర్కొన్న అంశాల విషయానికి వెళ్తే.. ఈ-ఆఫీస్ వెర్షన్ ను అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం షెడ్యూల్ చేసిన ఈ-ఆఫీస్ వెర్షన్ అప్ గ్రేడ్ వల్ల సీఎంవో, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాల సేవలకు సంబంధించి ఈ ఆఫీస్ ఈ నెల 17 నుండి 25 వరకు అందుబాటులో ఉండదు. అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన ఈ విధానంపై అధికారులు, రాజకీయ పార్టీలో అనుమానాలు ఉన్నాయన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్ సైట్ లో పెట్టడకుండా రహస్యంగా ఉంచుతోందని దుయ్యబట్టిన ఆయన.. అడ్డగోలుగా విడుదల చేసిన జీవోలను, ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దాడి చేసిందన్నారు.. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ-ఆఫీస్ వెర్షన్‌ మార్పు కోసం నిర్ణయం తీసుకోవడం సరికాదు. 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ ఆఫీస్ మూసివేత, అప్ గ్రేడ్ ప్రక్రియను కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేదాకా నిలిపివేయాలని సీఎస్ ను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు చంద్రబాబు.

ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమైనట్లు తెలిసింది. కొద్దిరోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు రికార్డులను సీఐడీ కూడా అనుమతి లేకుండా కాల్చేసిందని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.. ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చివేతపై సీఈవోకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అన్ని ఫైళ్లు, నోట్ ఫైల్‌లు, రికార్డ్‌లు మాయం కాకుండా భద్రపరచాలి. అన్ని హెచ్‌వోడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న చోట పరిశీలన జరపాలి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న ఫిజికల్ డాక్యుమెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్లు భద్రపరిచేలా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వాలని తన లేఖ ద్వారా గవర్నర్‌ను కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.